Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ఇవాళ ఈ వేదిక నుంచి మీకు మాట ఇస్తున్నా…

Must read

తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రేవంత్ రెడ్డి తన తొలి ప్రసంగం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆషామాషీగా ఏర్పడిన రాష్ట్రం కాదని, పోరాటాలతో త్యాగాల పునాదులపై ఏర్పడిన రాష్ట్రం అని పేర్కొన్నారు. 

ఈ తెలంగాణలో రాష్ట్రం ఎన్నో ఆకాంక్షలను, ఎన్నో ఆశలను, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని, రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ప్రజలకు స్వేచ్ఛనివ్వాలని, సామాజిక న్యాయం చేయాలని… ఆసిఫాబాద్ నుంచి ఆలంపూర్ వరకు… ఖమ్మం నుంచి కొడంగల్ వరకు సమానంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో సోనియా గాంధీ ఉక్కు సంకల్పంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ  సమిధగా మారినప్పటికీ సోనియా గాంధీ వెనుకంజ వేయలేదని కొనియాడారు. 

కానీ, దశాబ్ద కాలంగా ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యం హత్యకు గురైందని, మానవ హక్కులకు భంగం కలిగిందని అన్నారు. తమ బాధలు చెప్పుకోవడానికి ఈ ప్రభుత్వంలో వినేవాళ్లెవరూ లేకపోవడంతో గత పదేళ్లుగా ప్రజలు మౌనంగా భరించారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడా ప్రజలే తమకోసం తాము గెలిపించుకున్న రాజ్యం ఈ ఇందిరమ్మ రాజ్యం అని వివరించారు. ఈ ఎన్నికల్లో ఎన్నో త్యాగాలు చేసి, రక్తాన్ని చెమటగా మార్చి, భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ జెండాను మోసి విజయానికి సహకరించారంటూ తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజలు ప్రగతి భవన్ లోకి ఎలాంటి అడ్డంకలు లేకుండా వచ్చి తమ ఆలోచనలను, ఆకాంక్షలను ప్రభుత్వంతో పంచుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వంలో మీరు భాగస్వాములు. రాష్ట్ర ప్రభుత్వంలో మీ ఆలోచనలను, అభివృద్ధిని మిళితం చేసి… సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మీ అభిమాన నాయకుడిగా, మీ రేవంత్ అన్నగా, మీ మాట నిలబెడతానని మాట ఇస్తున్నా. ఇవాళ ప్రగతి భవన్ ఇనుప కంచెలు బద్దలు కొట్టాం. రేపు ఉదయం 10 గంటలకు జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో ప్రజా దర్బారు నిర్వహిస్తాం. 

మా తెలంగాణ ప్రజలు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి హక్కులు కాపాడేందుకు కృషి చేస్తాం. శాంతిభద్రతలు కాపాడుతూ హైదరాబాద్ నగరంతో పాటు  తెలంగాణను కూడా ప్రపంచంతో పోటీ పడేలా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళతాం. పేదలకు, నిస్సహాయులకు అండగా నిలవడమే మా తొలి ప్రాధాన్యత. మాకెవరూ లేరు, మాకు ఏ దిక్కూ లేదు అని ఎవరూ అనుకోకూడదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది… మీ సోదరుడిగా, మీ బిడ్డగా మీ బాధ్యతలు నేను స్వీకరిస్తాను. 

కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, సోనియమ్మ అండతో, మల్లికార్జున్ ఖర్గే నేతృత్వం, రాహుల్ గాంధీ సూచనలతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించి… మేం పాలకులం కాదు, ప్రజలకు సేవ చేయడానికి ఎన్నికైన సేవకులం అని నిరూపించుకుంటాం. మీరు మాకు సేవ చేసే అవకాశాన్ని ఇచ్చారు… ఆ అవకాశాన్ని ఎంతో బాధ్యతతో నిర్వర్తిస్తాం. 

కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు లక్షలాది కార్యకర్తలు ప్రాణాలను లెక్కచేయకుండా కష్టపడి పనిచేశారు. మీ కష్టాన్ని తప్పకుండా గుర్తుంచుకుంటా… మీరిచ్చిన శక్తిని గుండెల నిండా నింపుకుంటా. ఈ పదేళ్లు అనేక కష్టనష్టాలకోర్చిన కార్యకర్తలను గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యతను నాయకుడిగా నేను తీసుకుంటా… ఢిల్లీలో మన కుటుంబ సభ్యులుగా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ బాధ్యత తీసుకుంటారు. 

ఇవాళ్టి నుంచి నిరుద్యోగ ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. తెలంగాణకు పట్టిన చీడపీడల నుంచి విముక్తి కలిగించి, ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో మీరందరూ కుటుంబ సభ్యుల్లా పాల్గొన్నారు. 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you