తెలంగాణ వీణ , హైదరాబాద్ :తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన పేరును ప్రకటించడానికి ముందు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి హుటాహుటిన బయలుదేరి ఢిల్లీకి చేరుకున్నారు. అప్పటికే హైకమాండ్ ఆయనను సీఎంగా ప్రకటించింది. ఢిల్లీకి వెళ్లగానే తెలంగాణ ఎన్నికల పరిశీలకుడు డీకే శివకుమార్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మానిక్‌రావు థాక్రేను రేవంత్ కలిశారు.
ఇవాళ ఉదయం నుంచి కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలతో రేవంత్‌రెడ్డి వరుస భేటీలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఆయన భేటీ అయ్యారు. సీఎల్పీ నేతగా తనను ప్రకటించిన నేపథ్యంలో వారిద్దరికీ రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు. కాసేపట్లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో ఆయన సమావేశం కానున్నారు.