తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేత, ఆ పార్టీ ప్రచార కమిటీ చీఫ్ కోఆర్డినేటర్ విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాజకీయ భవితవ్యం గురించి తనకు తెలియదని, కానీ సర్వే ఫలితాలను బట్టి చూస్తే బీఆర్ఎస్ రాజకీయ ప్రయాణం అధికార పక్షంగానే ముగుస్తుందని మాత్రం చెప్పగలనని పేర్కొన్నారు. తెలంగాణకు రానున్న మంచి రోజుల కోసం, కాంగ్రెస్ విజయం కోసం డిసెంబరు 3 వరకు చూద్దామని అన్నారు. హరహర మహాదేవ, జై తెలంగాణ, జై హింద్ అని ఎక్స్ ద్వారా పేర్కొన్నారు.
తెలంగాణ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల, నోటిఫికేషన్ల స్వీకరణ వరకు బీజేపీలోనే ఉన్న విజయశాంతి ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ ఆమెను వెంటనే క్యాంపెయిన్ కమిటీ కోఆర్డినేటర్‌గా నియమించింది. కాగా, నవంబరు 30న విజయశాంతి ఎక్స్ చేస్తూ.. కోట్లాది తెలంగాణ బిడ్డల జీవితాలు ఎప్పటికీ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా నిరంతరం కోరుకునే ఒక ఉద్యమకారిణని పేర్కొంటూ ఓ వీడియో సాంగ్‌ను జతచేశారు.