తెలంగాణ వీణ, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. శనివారం తెల్లవారుజామున జిల్లాలోని జహీరాబాద్ మండలం బూజ్‌నేల్లి సమీపంలో ఓ కారు బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో పెద్దమొత్తంలో గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. అది క్వింటాలుకుపైగా ఉంటుందని తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత అందులో వచ్చిన వ్యక్తులు కారును అక్కడే వదిలి వెళ్లినట్లు చెప్పారు. దాని విలువ రూ.50 లక్షలకుపైగా ఉంటుందన్నారు.
కారు నంబర్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నామని వెల్లడించారు. చుట్టుపక్క ప్రాంతాల్లో స్మగ్లర్ల కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. కర్ణాటక సరిహద్దుల్లో ప్రమాదం జరగడంతో దానిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉన్నది. అయితే గంజాయిని ఒడిశా నుంచి తరలిస్తున్నట్లు తెలుస్తున్నది.