తెలంగాణ వీణ , రాష్ట్రీయం : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వరప్రదాయిని అయిన నాగార్జునసాగర్ డ్యామ్‌పై బుధవారం రాత్రి నుంచి ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. ఏపీ ఇరిగేషన్ అధికారులు సుమారు 500 మంది పోలీసులతో బుధవారం అర్ధరాత్రి ఆంధ్రా ప్రాంతం వైపు ఉన్న ఎంట్రెన్స్ నుంచి డ్యామ్‌పైకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ సిబ్బంది వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆంధ్రా పోలీసులు డ్యామ్ సెక్యూరిటీ గేట్‌పైనుంచి దూకి, గేట్ మోటర్‌ను ధ్వంసం చేసి గేట్‌ను తెరుచుకొని లోపలికి చొరబడ్డారు. వారిని నియంత్రిస్తున్న ఎస్పీఎఫ్ సిబ్బందిపై దాడిచేశారు.
డ్యామ్ సీసీ కెమెరాలు, ఎస్పీఎఫ్ సిబ్బంది ఫోన్లను ధ్వంసం చేశారు. డ్యామ్ 13వ గేట్ వరకు డ్యామ్ తమదని, అక్కడ ముళ్ల కంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేసి రోడ్డును మూసి వేశారు. దాంతో రాకపోకలు నిలిచిపోయాయి. డ్యామ్‌పై విధులు నిర్వహించే సిబ్బంది 13వ గేట్ దాటి అటువైపు ఉన్న తెలంగాణ కంట్రోల్ రూమ్ వైపు వెళ్లలేకపోయారు. తెలంగాణ పోలీస్ అధికారులు వచ్చి పరిస్థితిని పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్యామ్ పైన ఇదే పరిస్థితి నెలకొన్నది. కాగా డ్యామ్ నిర్వహణ అంతా తెలంగాణ ప్రభుత్వం చేపడుతుంది. ఆంధ్రా సర్కారుకు ఆ బాధ్యత లేదు. కృష్ణా రివర్ బోర్డు సూచించిన నీటి వాటాల ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు డ్యామ్‌లోని నీటిని వినియోగించుకుంటాయి. ఈ నీటి వినియోగం విషయంలో పలుమార్లు ఇరు రాష్ర్టాల అధికారుల మధ్య వివాదాలు చోటుచేసుకున్నాయి.