తెలంగాణ వీణ , హైదరాబాద్ : మేడ్చల్ నియోజకవర్గంలో గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నియోజకవర్గం వ్యాప్తంగా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరుగలేదు. రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు సామరస్యంగా వ్యవహరించారు. పకడ్బందీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేశారు. పోలింగ్ కేంద్రాలకు సమీపంలో ఉన్న వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసివేయించారు. ఓటర్లు క్యూలో నిల్చోని, ఓటు హక్కును వినియోగించుకున్నారు. వృద్ధులు, వికలాంగులు, ప్రత్యేక అవసరాల వారు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు చేయూతనిచ్చారు. వీల్‌చైర్‌లో తీసుకెళ్లి, నేరుగా ఓటు వేయించారు. నియోజకవర్గం వ్యాప్తంగా ఐదు చోట్ల ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రాలు ఆకట్టుకున్నాయి.
3 గంటల తర్వాత తరలివచ్చిన ఓటర్లు
ఓటర్లు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మోస్తారుగా ఓటు వేయడానికి వచ్చారు. 5 గంటల వరకు పోలింగ్ సమయం ముగియనున్నందున 3 గంటల తర్వాత ఓటు వేయడానికి తరలివచ్చారు. దీంతో పోలింగ్ కేంద్రాలు కిక్కిరిసిపోయాయి. 5 గంటలలోపు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పించారు. సాయంత్రం 7 గంటల దాటినా పోలింగ్ కొనసాగింది.