తెలంగాణ వీణ , హైదరాబాద్ : మల్కాజిగిరి నియోజకవర్గంలో ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. గురువారం ఉదయం 7నుంచి సాయంత్రం 5గంటల వరకు జరిగిన పోలింగ్‌లో 46.80 శాతం జరిగింది. పోలింగ్ కోసం అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ స్టేషన్‌లకు ఉత్సాహంగా వచ్చారు. పోలీసులు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అవి మొరాయించాయి. దీంతో పోలింగ్ ప్రక్రియ నిర్దే శించిన సమయం కంటే దాదాపు అరగంట ఆలస్యంగా మొదలు కా వడంతో ఓటర్లు అసౌకర్యానికి గురయ్యారు. ఆర్‌కె.పురం, సాయినాథ్‌పురం, మధురానగర్‌లోని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ అరగంట ఆలస్యంగా మొ దలైంది. ఎన్నికల సిబ్బంది ఈవీఎంలను సరి చేయడంతో పోలింగ్ యథావిధిగా కొనసాగింది.ఉదయం 7 గంటల నుంచి తొమ్మిది గంటల వరకు 5.8శాతం, ఉదయం 11గంటల వరకు 14.21శాతం, మధ్యాహ్నం 1గంట వరకు 26.9శాతం, మూడు గంటల వరకు 36.37శాతం, సాయంత్రం 5గంటల వరకు 46.8 పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో సుమారు 53శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి తగ్గటం గమనార్హం.