తెలంగాణ వీణ , హైదరాబాద్ : ఉప్పల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. దీంతో అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. కాప్రా, ఉప్పల్ సర్కిళ్ల పరిధిలో ఉదయం 7 గంటలకు ముందు నుంచే ప్రజలు ఓటు వేయడానికి తరలిరావడం కనిపించింది. చాలా కేంద్రాల్లో ఉదయం 9 గంటలలోపే పోలింగ్ కేం ద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఉన్నారు. ఉదయం 9 గంటల వరకు 5శాతంకు పైగా ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోగా, ఉదయం 11.00 గంటలవరకు 15.1శాతం ఓటింగ్ జరిగింది. ఉప్పల్ బీఆర్‌ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి .. కాప్రా ఆదిత్యనగర్‌లోని విజయా హైస్కూల్‌లో బీఆర్‌ఎస్ నాయకులు బద్రుద్దీన్, వంశరాజ్ మల్లేష్‌లతో పాటు పోలింగ్ కేంద్రానికి వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాజు, ఆయన సతీమణి జూడీతో కలిసి కందిగూడ కమ్యూనిటీహాల్‌లోని పోలింగ్ స్టేషన్ నంబర్ 3లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయిబాబానగర్‌లోని ఇండో అమెరికన్ స్కూలు కేంద్రం( పీఎస్ నంబర్లు-33,34,35,36 )లో పోలింగ్ మందకొడిగా సాగడంతో ఓటర్లు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశా రు. వందలాది మంది గంటల తరబడి వేచి ఉండి.. . కొంతమంది వెనుతిరిగి వెళ్లారు. దీనిపై ఉన్నతాధికా రులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని ప్రధాన పార్టీల కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు.