తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణలో 70కి పైగా స్థానాల్లో బీఆర్‌ఎస్ విజయం సాధించబోతున్నదని, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు చూసి బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరుత్సాహపడొద్దని, అవన్నీ కల్పితాలేనని స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూ లైన్‌లోనే నిలబడి ఉన్నారని, పోలింగ్ పూర్తి కాకుండానే ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. 2018లోనూ ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు ఇచ్చారని, 5 ఎగ్జిట్‌పోల్స్‌లో ఒక్కటి మాత్రమే కరెక్ట్ అని, మిగిలిన నాలుగు తప్పేనని చెప్పారు. 2018లో బీఆర్‌ఎస్‌కు 48 సీట్లు వస్తాయని ఒక ఎగ్జిట్‌పోల్ చెప్తే, 50 సీట్లు గెలుస్తారని మరొకరు, 52 వస్తాయని ఇంకొకరు, 66 సీట్లు వస్తాయని వేరొకరు చెప్పారని, అవన్నీ తప్పయ్యాయని గుర్తు చేశారు. అప్పట్లో ఎగ్జిట్‌పోల్స్ తప్పని నిరూపిస్తూ బీఆర్‌ఎస్‌కు 88 సీట్లు వచ్చాయని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ 69-72 స్థానాల్లో విజయం సాధిస్తుందని తనకు కూడా ఒకరు ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు పంపారని, తాను దాన్ని కూడా అంగీకరించనని చెప్పారు. ఓటింగ్ ప్రక్రియ పూర్తికాకుండానే ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలకు అనుమతి ఎలా ఇస్తారని ఎన్నికల సంఘం సీఈవోను అడిగామని, కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిందని చెప్పారని, కానీ.. అది సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు