తెలంగాణ వీణ , హైదరాబాద్ : సీమాంధ్ర సోదరులను కేసీఆర్ కడుపులో పెట్టి చూసుకున్నారు. తెలంగాణ వస్తే అది జరుగుతుంది.. ఇది జరుగుతుంది.. అని గత పాలకులు సీమాంధ్రులను భయభ్రాంతులకు గురిచేశారు. కానీ ఈ పదేండ్లలో అలాంటి ఘటన ఏదైనా జరిగిందా? అన్నదమ్ముల్లా అందరూ ప్రశాంతంగా ఉన్నారు. గతంలో కంటే ఉపాధి అవకాశాలు పెరిగాయి. వ్యాపారాలూ సాగుతున్నాయి. అందుకే ఓటు వేసే ముందు సీమాంధ్ర సోదరులు ఒక్కసారి ఆలోచించాలని చెబుతున్నారు ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి. ఈ ప్రాంత అభ్యున్నతిని కాంక్షించే వ్యక్తిగా.. అభివృద్ధిని మాత్రమే చూసి ఓటు వేస్తానని చెబుతున్న ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించారు.
నాటి, నేటి తెలంగాణ పరిస్థితులపై నాకు చాలా అవగాహన ఉన్నది. నాడు ఎద్దు ఏడ్చింది.. ఎవుసం ఏడ్చింది. ఓ వైపు ఎండిన పంటలు, పేదరికం, రైతు ఆత్మహత్యలు, మరోవైపు వలస బతుకులు. నేడు దేశంలో అందరికంటే ఎక్కువ సంతోషంతో ఉన్నది తెలంగాణ రైతులే. రైతుబంధు ఇచ్చి రైతన్నలను ఆదుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారా? రైతు లక్ష్యంగా ఆయన తీసుకొచ్చిన పథకాలు తెలంగాణ గ్రామీణ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చాయి. పల్లెల్లో చెరువులు నీళ్లతో కళకళలాడుతున్నాయి. పచ్చని పంట పొలాలు కనిపిస్తున్నాయి. రాత్రింబవళ్లు కరెంటు ఉంటున్నది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారంతో ఊళ్ల్లు కొత్త కళను సంతరించుకున్నాయి.
20 ఏండ్లపాటు పెద్దఎత్తున తెలంగాణ ఉద్యమం జరిగినా.. ఆంధ్రా సహా ఇతర ప్రాంతాల సెటిలర్స్‌ను తన బిడ్డల లెక్క కాపాడారు కేసీఆర్. ఎందుకు ఆయనకు ఓటు వేయకూడదు? తండ్రిలాగా ఎంతలా మాట్లాడుతారో.. కొడుకులాగా అంతే కరిగిపోతారాయన (గుండెమీద చెయ్యి వేసుకొని). దయచేసి నా విన్నపం ఒక్క టే.. మీరంతా కులమతాలకు అతీతంగా ఆలోచించి, మంచివారు ఎవరు? అభివృద్ధి చేసింది ఎవరు? మనల్ని కాపాడుతున్నది ఎవరు? అనేది గుర్తించి ఓటు వేయాలి