తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అంటూ రాష్ట్ర బీజేపీ నేతలు చెప్పుకుంటూనే ఎన్నికల సంగ్రామంలోకి దిగారు. ఇక, ఈసారి తెలంగాణలో బీజేపీ జెండా ఎగురబోతుందని గట్టిగానే సౌండ్ వినిపించారు. నాటి దుబ్బాక ఎన్నికల్లో గెలుపు నుంచి మొన్నటి జీహెచ్‌ఎచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పొందిన సీట్లే ఇందుకు నిదర్శమని కాషాయనేతలు చెబుతున్నారు. అందులో భాగంగానే ఎన్నికల మేనిఫెస్టోలో సైతం బీజేపీ.. తెలంగాణ ప్రజలకు కీలక హామీలను సైతం ప్రకటించింది. ఎన్నికల సందర్భంగా బీజేపీ జాతీయ నేతల నుంచి స్థానిక నేతల వరకు ప్రచారంలో దూకుడు పెంచారు.
జోడు పదవులకు న్యాయం జరుగుతోందా?
నేను పదవిలోకి వచ్చి రెండు నెలలు అవుతోంది. ఈ సమయంలో పార్టీ కోసం, ఎన్నికల కోసం, జాతీయ స్థాయితో సమన్వయంతో కేడర్ స్థాయిలో కార్యకర్తగా నేను పూర్తి స్థాయిలో నా అనుభవం పెట్టి పనిచేస్తున్నాను.
బీజేపీ టెంపో డౌన్ అయ్యిందా?
ఒక పథకం ప్రకారం కొన్ని శక్తులు ఇలాంటి ప్రచారం చేస్తున్నాయి. ప్రజల్లో అలాంటి పరిస్థితి లేదు. సుమారు 100 స్థానాల్లో బీజేపీ బలంగా ఉంది. కొన్ని స్థానాల్లో బీఆర్‌ఎస్‌కు, మరికొన్ని స్థానాల్లో కాంగ్రెస్‌కు ధీటుగానే బీజేపీ బలంగా ఉంది. మాకు వస్తున్న ఫీడ్ బ్యాక్ మా దగ్గర ఉంది.
కిషన్‌రెడ్డి వల్ల బీజేపీకి లాభమా?.. బీఆర్‌ఎస్‌కా?
రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై సోషల్ మీడియాలో కొంత అసత్య ప్రచారం జరుగుతోంది. సామాన్య ప్రజలు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కొన్నేళ్లుగా బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నది బీజేపీనే. నేను అధ్యక్షుడి అయిన రెండు నెలల్లో పలుమార్లు కేసీఆర్ సర్కార్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపాను. రెండు సార్లు నన్ను అరెస్ట్ కూడా చేశారు. ప్రజల కోసం కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎస్‌పై ఏనాడూ పోరాటం చేయలేదు. జైళ్లకు వెళ్లింది, కేసులు పెట్టించుకున్నది బీజేపీ నేతలు. ఎక్కడ కూడా బీఆర్‌ఎస్‌కు తగ్గలేదు. గతంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేశాయి. బీఆర్‌ఎస్ పార్టీ.. కాంగ్రెస్ నేతలను కొనుగోలు చేసిన విషయం ప్రజలకు తెలుసు. బీజేపీ ఎప్పటికీ కుటుంబ పార్టీలో కలవదు. బీఆర్‌ఎస్, మజ్లీస్ ఒక్కటే. కానీ, మజ్లిస్ పార్టీలో బీజేపీ ఎన్నటికీ కలిసే ప్రసక్తే లేదు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నది ఎంత నిజమో.. మజ్లీస్ వంటి పార్టీతో బీజేపీ కలవదు అన్నది కూడా అంతే నిజం.
తెలంగాణపై కర్ణాటక ఎఫెక్ట్ ఉందా?
కర్టాటక ఫలితాల తర్వాత తెలంగాణకు భారీ మొత్తంలో డబ్బు చేరుతోంది. అక్కడ పన్నుల ద్వారా వచ్చిన డబ్బును తెలంగాణలో ఎన్నికల ప్రచారం కోసం వాడుకుంటున్నారు. వేల కోట్లను మీడియా మేనేజ్‌మెంట్, సోషల్ మీడియాకు వాడుకుంటున్నారు. కానీ, కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మడం లేదు.