తెలంగాణ వీణ , హైదరాబాద్ : అవినీతి బీఆర్‌ఎస్ సర్కార్‌ను గద్దె దింపాలని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి అన్నారు. గురువారం తుర్కపల్లి మండలంలోని మాధాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మళ్లీ ఇప్పుడు ఎన్నికల ముందు కొత్త హామీలతో ప్రజల ముందుకు వస్తున్నారని విమర్శించారు.
సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే ఈ రాష్ట్రంలో బాగుపడిందని అన్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు, ఇంటికో ఉద్యోగం, కేజీ టూ పీజీ ఉచిత విద్య అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో సీఎం కేసీఆర్ కమీషన్లు నొక్కేస్తే, ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కాంకు పాల్పడిందని ఆరోపించారు. మరోసారి కేసీఆర్‌కు అవకాశం ఇస్తే నిరుపేదల జీవితం మరింత దుర్భరంగా మారుతుందని అన్నారు.
కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్ర ఇన్‌చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుసుమకుమార్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శంకర్‌నాయక్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు భాస్కర్‌నాయక్, ప్రధాన కార్యదర్శి నర్సింహులు, వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు శ్రీనివాస్‌యాదవ్, మోహన్‌బాబునాయక్ తదితరులు పాల్గొన్నారు.