తెలంగాణ వీణ , హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణకు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి. గజ్వేల్ నుంచి మూడోసారి పోటీకి దిగుతున్నారు. అయితే.. 1985 నుంచి ఆయన పోటీచేసిన ప్రతీసారి, ప్రతీ నియోజక వర్గంలోనూ జైత్రయాత్ర చేస్తూనే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలు అయినా.. పార్లమెంట్ ఎన్నికలైనా ఓటమి ఎరుగని విజేతగా చరిత్ర సృష్టిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు హ్యాట్రిక్ కట్టబెట్టడంతోపాటు హ్యాట్రిక్ సీఎంగా దక్షిణ భారతదేశంలో సరికొత్త రికార్డు నెలకొల్పాలనుకుంటున్నారాయన.
కేసీఆర్, ఈటల రాజేందర్.. గత ఎన్నికల సమయంలో ఒకేపార్టీలో కలిసిమెలిసి ఉండేవారు. ఇప్పుడు సీన్ మారింది. ప్రత్యర్థులుగా విమర్శల్ని దూసుకుంటున్నారు. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈ ఇద్దరూ తలపడుతున్నారు. గజ్వేల్ కేసీఆర్‌పై బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బరిలో నిల్చున్నారు. పూర్వం బీఆర్‌ఎస్‌లో ఉన్న ఈటల.కేసీఆర్‌తో సన్నిహితంగానూ పని చేశారు. అయితే తదనంతర పరిణామాలతో బయటకు వచ్చి కేసీఆర్‌పై ఈటల తీవ్రస్థాయిలోనే విమర్శలు చేశారు. ఆపై ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. బీజేపీలో చేరి ఉప ఎన్నికల(2021) ద్వారా పోటీ చేసి బంపర్‌మెజార్టీతో గెలుపొందారు. కేసీఆర్-కారు పార్టీ హవాను తట్టుకుని మరీ గెలిచిన ఈటల గురించి జాతీయ స్థాయిలోనూ పెద్ద చర్చ నడిచింది. బీజేపీకి తెలంగాణ రాజకీయాల్లో ఈ విజయం బలాన్ని ఇచ్చింది.