తెలంగాణ వీణ, కాప్రా: ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి రావుల శ్రీధర్ రెడ్డి సైనిక్ పురిలోని బండారి లక్ష్మారెడ్డి క్యాంపు కార్యాలయంలో మీర్పేట్ హెచ్.బీ.కాలనీ, మల్లాపూర్ కార్పొరేటర్లు జెర్రిపోతుల ప్రభుదాస్, పన్నాల దేవేందర్ రెడ్డిల, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, పావనిమణిపాల్ రెడ్డిలతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిన్న విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడేది కాదన్నారు. యూత్ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్ అన్నారు వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కొండమీద కోతిని ఇస్తాను అన్నట్టు ఉందన్నారు. ఆరు హామీలు అని ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి అమెరికాలో మూడు గంటలు కరెంట్ చాలంటాడు, మళ్లీ ఇక్కడికి వచ్చి 5 గంటలు చాలు అంటాడు, ఇదంతా ప్రజలను, ఓటర్లను మభ్యపెట్టి ఓట్ల కోసం ఎగబడుతున్నారని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో
రాష్ట్రంలో చతుర్విప్లవం నడుస్తోందన్నారు. కాళేశ్వరంతో పాటు పలు ప్రాజెక్టులపై కేసులు వేశారన్నారు. జూటా మాటలు చెప్పే పార్టీలను ప్రజలు నమ్మొద్దని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పారిశ్రామిక వాడలకు పవర్ హాలిడేలు ఇచ్చారన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 24 గంటలు విద్యుత్ ఇస్తుండటంతో పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు అందరూ బాగుపడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంగ్లీష్ మీడియంపై మాట్లాడుతున్నారని గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులకోసం ఇంగ్లీష్ మీడియం క్లాసులు పెట్టాలని ఎద్దేవా చేశారు. పేద ప్రజలకోసం బీఆర్ఎస్ పార్టీ 15 లక్షల ఆరోగ్యశ్రీ పథకం అందిస్తుందన్నారు. హిందూ దేవాలయాల గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. హిందూ దేవాలయాలకు, పండగలకు ప్రభుత్వం నుండి కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందన్నారు. గంగా, జమున, తహజీబ్ తెలంగాణలో అమలులో ఉందన్నారు. వైద్యరంగంలో కేసీఆర్ ఓ కమిట్మెంట్ తో పనిచేస్తున్నారని, బస్తీదవాఖానలు పెట్టి అన్నిరకాల ఆరోగ్య సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు.
మెట్రో గురించి మాట్లాడుతున్నారని దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మెట్రో విస్తరించిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, మెట్రో, విద్య, వైద్యం, విద్యుత్ ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, కాంగ్రెస్ చేయడానికి ఇంకా ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దొంగ మేనిఫెస్టోలు తెచ్చి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను కాఫీ కొడుతున్నాయని హేళన చేశారు. కేసీఆర్ భీమా ప్రతీ ఇంటికి ధీమా అని కొనియాడారు. వాస్తవాలు గమనించి రాష్ట్రాన్ని ఎవరు అభివృద్ధి చేశారో, ఎవరు ప్రజలకోసం పనిచేశారో వారికే ప్రజలు పట్టం కట్టాలని కోరారు. మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని రావుల శ్రీధర్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు.