తెలంగాణ వీణ , హైదరాబాద్ : నాటి నుంచి నేటి దాకా తెలంగాణకు శత్రువు కాంగ్రెస్ పార్టీనే అని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. బోధన్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
మూడోసారి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్నాం. ఈ దేశంలో ఇంకా కూడా ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సిన పరిణితి రాలేదు. ఇంకా కూడా కులం, మతం పేరిట కొట్లాటలు, పంచాయితీలు, ఝూటా వాగ్దానాలు, ఆరోపణలు, అభాండాలు.. ఒక పిచ్చిపిచ్చిగా గడబిడి జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సిన పరిణితి రాకపోవడం. ఏయే దేశాల్లో ప్రజాస్వామ్య ప్రక్రియ పరిణితి చెందిందో ఆ దేశాలు అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్నాయి. మనం కూడా అలా బాగుపడాల్సిన అవసరం ఉంది అని కేసీఆర్ పేర్కొన్నారు.
15 ఏండ్లు ఏడిపించి మోసం చేసే ప్రయత్నం చేశారు
దుర్మార్గమైన కాంగ్రెస్ నాటి నుంచి నేటి దాకా తెలంగాణకు శత్రువే. 2004లో పొత్తు పెట్టుకుంటామని వచ్చారు. తెలంగాణ ఇస్తారని నమ్మి పొత్తు పెట్టుకున్నాం. 2004లో గెలిస్తే 2005, 2006లో తెలంగాణ ఇవ్వలేదు. 15 ఏండ్లు ఏడిపించారు. మోసం చేసే ప్రతయ్నం చేశారు. బీఆర్ఎస్ పార్టీని చీల్చి ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశారు. ఉద్యమాన్ని మొత్తం ఆగం పట్టించి మరోసారి ద్రోహం చేసే పరిస్థితి చేశారు. 15 ఏండ్లు ఏడిపించి, వందల మందిని పొట్టను పెట్టుకుని తెలంగాణ ఇచ్చారు. పదేండ్ల నుంచి బీఆర్ఎస్ ఏం చేస్తుందో మీరు చూస్తున్నారు. నిజాం సాగర్ నిజాం రాజు కట్టిన ప్రాజెక్టు ఇది. 1934లో మొదలు పెట్టి కట్టారు. బాన్సువాడ, బోధన్, ఆర్మూర్ వరకు నీళ్లు పారి డిచ్‌పల్లి వరకు సస్యశ్యామలంగా ఉండే. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ వన్ జిల్లా ఏందంటే లక్ష్మీ ఉండే జిల్లా నిజామాబాద్ అని పేరుండే. నిజంగానే లక్ష్మీ దేవి ఉండే. కానీ సమైక్య రాష్ట్రంలో మాయమైంది. నిజాంసాగర్‌ను ఎండబెట్టి.. మీద కట్టిన సింగూరు ప్రాజెక్టును హైదరాబాద్‌కు గంపగుత్తగా మంచి నీళ్ల కోసం ఇచ్చి పంటలు ఎండబెట్టారు. రైతులు బాధపడ్డారు. మీరు ప్రత్యక్షంగా అనుభవించారు. సింగూరు నుంచి నీళ్లు రావాలని నిజామాబాద్ కలెక్టరేట్‌లో ధర్నాలు చేసిన పరిస్థితి చూశామని కేసీఆర్ తెలిపారు.