తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణకు నేటితో గడువు ముగియనుంది. దీంతో, నామినేషన్లు వేసిన వారిపై ప్రధాన పార్టీల నేతలు ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో రెబల్స్ నేతలు అభ్యర్థులను టెన్షన్ పెడుతున్నారు. దీంతో, కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి రెబల్స్‌ను బుజ్జగిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పెద్దలు.. సూర్యాపేటలో రెబల్ అభ్యర్థి పటేల్ రమేష్ రెడ్డిని కలిశారు.
వివరాల ప్రకారం.. సూర్యాపేట కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పటేల్ రమేష్ రెడ్డి ఇంటికి ఏఐసీసీ పెద్దలు వెళ్లారు. ఈ సందర్బంగా ఎన్నికల్లో తాను వేసిన నామినేషన్ ఉపసంహరించుకోవాలని వారు సూచించారు. ఇదే సమయంలో సూర్యాపేట కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని రమేష్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఏఐసీసీ పెద్దలను చూడగానే రమేష్ రెడ్డి మరోసారి బోరున విలపించారు. వారితో తన ఆవేదన వ్యక్తం చేశారు. రెండోసారి కూడా తనకు టికెట్ ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు.
ఇక, కాంగ్రెస్ పెద్దల బుజ్జగింపులను రమేష్ రెడ్డి పట్టించుకోలేదు. రమేష్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. రమేష్ ఇంటికి వెళ్లిన వారిలో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ, మల్లు రవి ఉన్నారు. మరోవైపు.. పటేల్ మద్దతుదారులు రోహిత్ చౌదరీ, మల్లు రవిని అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేతలకు వ్యతిరేకంగా రోడ్డుపై బెఠాయించి నిరసనలు తెలిపారు.