తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : పది నెలల క్రితం కడప విమానాశ్రయం వద్ద పోలీసులతో వాగ్వాదం, ఆందోళన చేపట్టిన కేసులో మంగళవారం రాత్రి అరెస్టయిన టీడీపీ నేత మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డికి కడప కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో మంగళవారం అర్ధరాత్రి ఆయనను కడప సెంట్రల్ జైలుకు తరలించారు వ్యక్తిగత పనిమీద మంగళవారం సాయంత్రం పులివెందుల నుంచి కడప వెళ్తుండగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని వల్లూరు పోలీసుస్టేషన్‌కు తరలించారు. రాత్రి 10 గంటల సమయంలో కడప ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించిన అనంతరం కడపలో జడ్జి ఎదుట హాజరుపరిచారు. దీంతో బీటెక్ రవికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలావుండగా బీటెక్ రవి అరెస్టుపై కడప డీఎస్పీ షరీఫ్ వివరాలు వెల్లడించారు. విమానాశ్రయం వద్ద జరిగిన తోపులాటలో తమ ఏఎస్‌ఐకి గాయాలయ్యాయని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి కేసు నమోదు చేశామని, బీటెక్ రవి అందుబాటులో లేకపోవడంతో మంగళవారం అరెస్టు చేసినట్టు వివరించారు.