తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణ ఆర్థిక ఛోదక శక్తి హైదరాబాద్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర జీడీపీలో 45 నుంచి 50 శాతం ఇక్కడి నుంచే వస్తున్నదని చెప్పారు. హైదరాబాద్‌ను నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రం కుంటుపడుతుందన్నారు. హైదరాబాద్ తాజ్ దక్కన్‌లో జరిగిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సమావేశానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే భూముల రేట్లు పడిపోతాయని ఆనాడు ప్రచారం చేశారు.. కానీ హైదరాబాద్‌లో రేట్లు 10 నుంచి 20 రెట్లు పెరిగాయన్నారు. హైదరాబాద్ సహా రాష్ట్రమంతా భూముల రేట్లు అధికమయ్యాయని చెప్పారు. మాజీ సీఎం చంద్రబాబు కూడా ఇదే విషయం చెప్పారని గుర్తుచేశారు. 2014కు ముందు వ్యవసాయానికి ఆధారం లేదని, పెట్టుబడి, నీళ్లు, కరెంటు ఉండేది కాదన్నారు. నాడు రైతులు ఆస్తులు అమ్ముకున్నా అప్పులు కట్టలేని దుస్థితి ఉండేదని, నేడు వారికి భూములే భరోసా అన్నారు. భూముల విలువ పెరగడంతో రాష్ట్రంలోని వ్యక్తుల్లో ధీమా వచ్చిందని చెప్పారు.
దేశానికే తెలంగాణ ఒక దిక్సూచి అని కేటీఆర్ అన్నారు. తొమ్మిదిన్నరేండ్లలో రాష్ట్రం బాగుపడిందని, అసాధారణ విజయం సాధించామని చెప్పారు. గత పాలకులు తమకేమీ అద్భుత దీపం ఇచ్చిపోలేదని, సుస్థిర ప్రభుత్వం, సమర్ధ నాయకత్వం వల్లే అభివృద్ధి సాధ్యమైందని చెప్పారు. కరోనా వల్ల రెండేండ్లు వృథా అయిందని, సరిగ్గా ఆరున్నరేండ్లు మాత్రమే పనిచేయగలిగామని వెల్లడించారు. అమెరికాలో కూడా సమస్యలు ఉన్నాయని చెప్పారు. ప్రాధాన్యక్రమంలో సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు. గత 65 ఏండ్ల పాలకులు ఏం చేశారు.. ఈ ఆరున్నరేండ్లలో తాము ఏం చేశామో చూడాలన్నారు. గత పాలకులు సరిగ్గా పనిచేస్తే నేడు ఇన్ని సమస్యలు ఉండేవా అని ప్రశ్నించారు. ఆనాడు కరెంటు ఉంటే వార్త.. కానీ ఇప్పుడు కరెంటు పోతే వార్త అని స్పష్టం చేశారు. పదేండ్ల కిందట పరిస్థితి ఎలా ఉండేదో ప్రజలు గుర్తుచేసుకోవాలన్నారు. రెండు సార్లు అవకాశం ఇచ్చాంకదా అని కొందలు అంటున్నారని, బాగా పనిచేసినప్పుడు మార్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. 11 సార్లు అవకాశం ఇస్తే కాంగ్రెస్ చేసిందేంటన్నారు. కష్టపడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కసాయి చేతుల్లో పెడదామా అన్నారు.
కాంగ్రెస్‌లో ప్రతిఒక్కరు ముఖ్యమంత్రి అభ్యర్థేనని ఎద్దేవా చేశారు. నామినేషన్ రిజెక్ట్ అయిన జానారెడ్డి కూడా సీఎం అభ్యర్థేనని విమర్శించారు. ఆ పార్టీలో 11 మంది సీఎం కాండెట్లు ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిని దించడానికి ఆ పార్టీ నేతలే మతకలహాలు పెట్టారన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఏమోకానీ.. ఆరు నెలలకో సీఎం గ్యారెంటీ అని ఎద్దేవా చేశారు.