తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. పురందేశ్వరి గారూ, మీరు టీడీపీలో ఎన్నాళ్లు ఉన్నారో కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్లారో కాంగ్రెస్ నుంచి ఎందుకు బయటకు వచ్చారో, బీజేపీలో ఎందుకు చేరారో ఇందులో ఏ ఒక్క ప్రశ్నకీ సమాధానం చెప్పలేకపోయారని విజయసాయి ఎద్దేవా చేశారు. కనీసం బీజేపీలో ఎన్నాళ్లు ఉంటారనేది అయినా చెప్పగలరా? అని ప్రశ్నించారు.
ఎన్టీఆర్ పెద్ద కూతురిగా పుట్టి ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి, ఎన్టీఆర్ వ్యతిరేక కాంగ్రెస్ లో మంత్రి పదవి అనుభవించి, కాంగ్రెస్ కు అధికారం దక్కదని బీజేపీలో చేరి, బీజేపీలో పదవి పొందారని వెల్లడించారు. టీడీపీ అధ్యక్షుడైన మీ మరిది కోసం అది కూడా తెలంగాణలో కాంగ్రెస్ తో జతకట్టిన మీ మరిది కోసం ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా కొమ్ము కాస్తున్నారంటే ఇన్ని రంగులు మార్చగలిగిన మీ నైపుణ్యాన్ని ఏమని పిలవాలి? అంటూ విజయసాయి వ్యంగ్యం ప్రదర్శించారు.