తెలంగాణ వీణ , హైదరాబాద్ : కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అహంకారానికి హద్దులే లేవని.. ఆయనేం పడగొడుతడో తెల్వదని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేటలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ‘ఇవాళ కాంగ్రెస్ బాధ్యతా రహిత్యంగా మాట్లాడుతున్నది. ఇదే జిల్లాకు చెందిన భట్టి విక్రమార్క, కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ, పీసీసీ అధ్యక్షుడు అందరూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటున్నారు. వాళ్లు వచ్చేది లేదు సచ్చేది లేదు. వస్తే వేస్తరనుకుందాం. వేస్తే ఏం జరుగుతుందో ఆలోచన చేయాలి. గతంలో ప్రభుత్వంలో రూపాయి సాంక్షన్ కావాలంటే ఎన్ని ఆఫీసులు తిరిగేది ? ఎంతమంది పైరవీకారులు ఉండేది ? ఈ రోజుల అట్ల లేదు’ అన్నారు.
రైతుబంధు ఎలా వస్తదంటే సమధానం చెప్పడం లేదు..
‘ధరణి పుణ్యమాని హైదరాబాద్‌లో డబ్బులు వేస్తే ఇక్కడ మీ సెల్‌ఫోన్లు టింగుటింగుమని మోగుతున్నయ్. ధాన్యం అమ్మిన డబ్బులు కూడా ఖాతాల్లో జమవుతున్నయ్. రైతులపట్ల సానుభూతి లేని పార్టీ ధరణిని తీసివేస్తమని మాట్లాడుతున్నది. మరి రైతుబంధు ఎలా వస్తుంది ? అని నేను అడిగితే వాళ్లు సమాధానం చెప్పడం లేదు. మళ్లీ పహానీ నకళ్లు, దళారులు, పైరవీకారులు డబ్బులు ఇవ్వాల్సిందే. మళ్లీ మొదటికే వెళ్తుంది. దరఖాస్తులు పెట్టడం.. ఆఫీసుల చుట్టూ తిరుగడం జరుగుతుంది. పారదర్శకంగా రూపాయి పొల్లుపోకుండా మేం ఎంత డబ్బు వేస్తే అంత డబ్బు మీ ఖాతాల్లో జమవుతున్నది. అందుకే నేను కోరింది ఏ పార్టీ వైఖరి ఏంది అనేది మీరు చూడాలి. ఆలోచన సరళి ఏంది అనేది చూడాలి. చూడకుండా గుడ్డిగా ఓటు వేస్తే కష్టమైతుంది. దయ చేసి ఆలోచించి పార్టీల వైఖరిపైనే ఓటుండాలి’ అంటూ పిలుపునిచ్చారు.
ఆయనకున్న అవగాహనేంటో..
‘పీసీసీ అధ్యక్షుడు ఒకటి రెండు, మూడు, నాలుగుసార్లు చెబుతున్నడు. ఆయన అహంకారానికి హద్దులే లేవు. ఆయన ఏం పడగొడుతడో.. ఏం చేస్తడో నాకు తెల్వది కానీ.. ఆయనకు ఉన్న అవగాహన ఏంటో నాకు తెల్వదు. ఆయనకు తెలివి ఏంటో తెలియదు. నేను కూడా రైతునే. కాబట్టి రైతుల బాధలు నాకు తెలుసు. ఒకాయనేమో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. ఆయన చెబుతున్నడు. కేసీఆర్‌కు ఏం పని లేదు. ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బంతా రైతుబంధు ఇచ్చి దుబారా చేస్తున్నడు అంటున్నడు. రైతుబంధు కావాలి అంటూ ప్రజలు నినదించారు. రైతుబంధు కావాలంటే మెచ్చ నాగేశ్వర్‌రావు గెలవాలి. ధరణిని బంగాళాఖాతంలో వేస్తరటా.. రైతుబంధు దుబారనట.. ఇంకో మాట చెబుతున్నరు డేంజరస్‌గా. కరెంటు 24గంటలు వేస్ట్.. కేసీఆర్ డబ్బులన్నీ చెడగొడుతున్నడు.. మూడు గంటలు ఇస్తే సరిపోతది అంటున్నడు. మరి మూడు గంటల కరెంటు సరిపోతుందా? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అదే పనైతది. అందుకే నేను చెప్పేది. ఎవరి వైఖరి ఏంది.. ఏ పార్టీ ఏం చెబుతున్నది ఆలోచించకుండా ఓటు వేస్తే ఆగమైపోతాం. మూడు గంటల కరెంటు పొలాలు పారుతాయా.. పామాయిల్ తోటలైనా పారుతాయా? 24 గంటల కరెంటు కావాలంటే మెచ్చ నాగేశ్వర్‌రావు గెలవాలి’ అన్నారు.