తెలంగాణ వీణ , హైదరాబాద్ : గోదావరి నదిపై ప్రాజెక్టును నిర్మించి పాత ఖమ్మం జిల్లాకు నీళ్లు సమృద్ధిగా ఇవ్వొచ్చని.. కానీ, ఏ ఒక్క కాంగ్రెస్ నేత ఆలోచించలేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టును నిర్మిస్తున్నదన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేటలో జరిగిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి మెచ్చ నాగేశ్వర్‌రావును మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. తెలంగాణ వచ్చిన నాడు చాలా సమస్యలు ఉండే. కరెంటు సమస్యలు, తాగునీళ్లు లేవు. సాగునీరు అస్సలే లేదు. ప్రజలు బతుకేందుకు వలసపోవడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది. మహబూబ్‌నగర్‌లాంటి నుంచి 15లక్షల మంది బొంబాయి, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన పరిస్థితి. మెదక్, నల్గొండ జిల్లాల నుంచి వలసపోయి బతికిన పరిస్థితి ఉంది’ అంటూ గుర్తు చేశారు.
ఏడాదిలోగా పది నియోజకవర్గాలు సస్యశ్యామలం..
‘గోదావరి నది తరతరాలుగా ఉన్నది. గోదావరి నదిపై సీతారామ ప్రాజెక్టును పాత ఖమ్మం జిల్లాకు నీళ్లు సమృద్ధిగా ఇవ్వొచ్చు. కానీ, ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఆలోచించలేదు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక సీతమ్మ సాగర్ నిర్మాణం జరుగుతున్నది. 75శాతం పనులు పూర్తయ్యాయి. ఒక సంవత్సరంలోగా పాత ఖమ్మంలోని పది నియోజకవర్గాలన్నీ సస్యశ్యామలమవుతుంది. ప్రగతి కాముకంగా, ప్రగతిశీలకంగా ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తూ పనులు చేస్తూ ముందుకెళ్తున్నాం. రైతులు పల్లెసీమల్లో చాలా ముఖ్యం. ఆ రైతులు చల్లగా ఉంటే ప్రపంచం కూడా శాంతిగా ఉంటుంది. రైతుల కోసం దేశంలో ఎక్కడా చేయని విధంగా రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చాం. రైతు స్థితీకరించబడాలనే.. వ్యవస్థాయ స్థిరీకరణ జరగాలి.. రైతుల అప్పుల భారం పోవాలి.. సొంత పెట్టుబడి కలిగి ఉండాలనే ఉద్దేశంతో నాలుగైదు కార్యక్రమాలు తీసుకున్నాం. వాటర్ ట్యాక్స్ తెలంగాణలో లేదు. కాలువలు, చెరువుల ద్వారా నీటిని ఇస్తే గతంలో ట్యాక్స్ తీసుకునేది. ఇప్పుడా ఆ పద్ధతి లేదు. కరెంటు చార్జీలు కూడా లేవు. 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతున్నది. ధాన్యం కొనుగోళ్లు జరిపి ఐదారు రోజుల్లో ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం’ అన్నారు.