తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : మద్యం ఇవ్వలేదనే కోపంతో ఓ మందుబాబు ఏకంగా వైన్ షాపుకు నిప్పంటించాడు. మంటలు ఎగిసిపడడంతో లోపల ఉన్న సరుకు కాలిపోయింది. దీంతో షాపు యజమానికి రూ.1.50 లక్షల నష్టం వాటిల్లింది. విశాఖపట్నంలోని మదురవాడలో ఆదివారం చోటుచేసుకుందీ ఘటన. పోతినమల్లయ్యపాలెం ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మదురవాడలోని ఓ వైన్ షాపుకు శనివారం రాత్రి క్లోజింగ్ టైమ్ లో మధు అనే వ్యక్తి వెళ్లాడు.
ఓ మందు బాటిల్ ఇవ్వాలని అడగగా.. టైమ్ అయిపోయింది, షాప్ క్లోజ్ చేస్తున్నామని అక్కడి సిబ్బంది చెప్పారు. దీంతో రెచ్చిపోయిన మధు.. షాపు సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరగడంతో షాపు సిబ్బంది మధును బెదిరించి అక్కడి నుంచి పంపించేశారు. ఆపై షాపును క్లోజ్ చేసి వెళ్లిపోయారు. ఆదివారం సాయంత్రం పెట్రోల్ క్యాన్ తో అదే షాపుకు వెళ్లిన మధు.. షాపులో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటలు ఎగిసిపడడంతో సిబ్బంది బయటకు పరుగులు తీశారు.