తెలంగాణ వీణ , రాజస్థాన్ : రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ స్టార్ ప్రచారకుల జాబితాలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ తర్వాత మూడో స్థానంలో ఉన్నది రాహులే. ఖర్గే రెండు మూడుసార్లు రాష్ట్రంలో ప్రచారంలో పాల్గొన్నారు. ప్రియాంక గాంధీ కూడా రెండు ర్యాలీల్లో ప్రసంగించారు. కానీ రాహుల్ మాత్రం రాష్ట్రంలో అడుగు పెట్టి ఏకంగా నెలన్నర దాటింది! ఆయన చివరిసారిగా సెప్టెంబర్ 23న జరిగిన రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తల భేటీలో పాల్గొన్నారు. ఇంత హోరాహోరీగా జరుగుతున్న ఎన్నికల్లో పార్టీ తరఫున అన్నీ తానై ప్రచార భారం మోయాల్సిన ఆయన ఎందుకిలా దూరంగా ఉంటున్నారన్న దానిపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది…
రాహుల్ గైర్హాజరీకి రాజస్థాన్ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్న కారణాలు కూడా పెద్దగా నమ్మశక్యంగా లేవన్న అభిప్రాయం వినిపిస్తోంది. రాజస్థాన్ కంటే ముందుగా పోలింగ్ జరుగుతున్న మిగతా రాష్ట్రాల్లో ప్రచారంలో రాహుల్ బిజీగా ఉన్నారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి సుఖీందర్సింగ్ రణ్ధవా చెప్పుకొచ్చారు. అందుకే ప్రస్తుతానికి ఆయన రాష్ట్రంపై దృష్టి పెట్టడం లేదన్నారు. కానీ ఇది సాకు మాత్రమేనని బీజేపీ అంటోంది. రాజస్థాన్ తర్వాత ఐదు రోజులకు నవంబర్ 30న పోలింగ్ జరగనున్న తెలంగాణలో రాహుల్ ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్న విషయాన్ని ప్రస్తావిస్తోంది.