తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : అధికారం ఉంటే రాష్ట్రాన్ని ఎలా దోచేయవచ్చొ జగన్ నిరూపించారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 16 నెలల పాటు జైల్లో ఉండి ఎలా దోచుకోవచ్చో రీసెర్చి చేశారన్నారు. ఏపీని జగన్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ఏపీకి జగన్ ఎందుకు అవసరం లేదో వంద కారణాలు చెబుతామని.. వంద కారణాలతో పుస్తకం వేస్తామని తెలిపారు. పోలవరం కట్టలేదని, రాజధాని లేకుండా చేశారని విరుచుకుపడ్డారు. ఒకసారి అవకాశం ఇస్తే ఏపీని తెలంగాణకు తాకట్టు పెట్టారని ఆరోపించారు. మరోసారి అవకాశం ఇస్తే బ్రిటీష్ వాడికి అమ్మేస్తారని ఆయన వ్యాఖ్యలు చేశారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత నాసిరకం సారా అమ్ముకుంటూ తాగుబోతులను పెంచారన్నారు. దళితులకు జగన్ చేసినంత ద్రోహం ఇంకే ముఖ్యమంత్రి చేయలేదన్నారు. విశాఖలో భూములు కొట్టేయడానికే కొత్త అసైన్మెంట్ చట్టం చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను భయపెట్టి బానిసలుగా చేస్తున్నారని.. మీడియా సమావేశం పెడితే పోలీసులను కాపలా పెట్టారని తెలిపారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో స్వేచ్ఛగా బ్రతకాలన్నా రాష్ట్రపతి పాలన కావాలన్నారు. ఒక్క తడికి నీళ్లు ఇవ్వలేని మంత్రి అంబటి పోసుకోలు ముచ్చట్లు చెబుతారని కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.