తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. రేపు నామినేషన్లను పరిశీలించనున్నారు. ఇక, నామినేషన్లలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గం నుంచి భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. గజ్వేల్‌లో 145 మంది కలిసి 154 నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో, గజ్వేల్‌లో నామినేషన్లతో బీఆర్‌ఎస్‌కు కొత్త టెన్షన్ ఎదురైంది. నామినేషన్లపై బీఆర్‌ఎస్ ఫోకస్ పెట్టింది.
వివరాల ప్రకారం.. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారీగా దాఖలైన నామినేషన్లపై బీఆర్‌ఎస్ ఫోకస్ పెట్టింది. సీఎం కేసీఆర్‌పై నామినేషన్లు వేసిన బాధితులను నేతలు బుజ్జగిస్తున్నట్టు సమాచారం. బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఇక, నామినేషన్లు వేసిన వారిలో వందకుపైగా రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లి ప్లాట్స్ బాధితులు, రైతులు ఎక్కువగా ఉన్నారు. రాష్ట్రంలో మూతపడ్డ చెరుకు ఫ్యాక్టరీలు తెరిపించాలని రైతులు నామినేషన్లు వేశారు. నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాల తరఫున 30కిపైగా నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో, రంగంలోకి దిగిన గులాబీ పార్టీ నేతలు వారిని విత్‌డ్రా చేసుకోవాలని బుజ్జగిస్తున్నారు. ఈ క్రమంలో గజ్వేల్ రాజకీయం రసవత్తరంగా మారింది.