తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : సినీ నటుడు చంద్రమోహన్ మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
‘‘ప్రముఖ నటుడు చంద్రమోహన్ గారు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూయడం బాధాకరం. తొలి సినిమాకే నంది అవార్డును గెలుచుకున్న ఆయన తెలుగు, తమిళ భాషల్లో వందలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. చంద్రమోహన్ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
ప్రముఖ నటుడు చంద్రమోహన్ (78) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. తరచూ డయాలసిస్ చేయించుకుంటున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం (నవంబర్ 11న) తుది శ్వాస విడిచారు. హైదరాబాద్‌లో సోమవారం అంత్యక్రియలు జరగనున్నాయి.
చంద్రశేఖర్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. కృష్ణాజిల్లా పమిడిముక్కలలో 1945 మే 23న జన్మించారు. మేడూరు, బాపట్లలో చదువుకున్నారు. ఈయన దివంగత దర్శకుడు కె.విశ్వనాథ్‌కి దగ్గరి బంధువు. చంద్ర మోహన్ భార్య పేరు జలంధర్. ఈమె రచయిత్రి. వీరికి మధుర మీనాక్షి, మాధవి అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మధుర మీనాక్షి సైకాలజిస్ట్‌గా అమెరికాలో స్థిరడ్డారు. రెండో కుమార్తె మాధవి చెన్నైలో వైద్యవృత్తిలో సేవలందిస్తున్నారు.