తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలో పర్యటించారు. మైనారిటీస్ వెల్ఫేర్ డే, నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, మైనార్టీలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని.. గతానికి, ఇప్పటికి మధ్య తేడాలు గమనించాలన్నారు. గత ప్రభుత్వంలో మైనార్టీలను టీడీపీ గాలికొదిలేసింది. డిప్యూటీ సీఎం హోదాతో మైనార్టీలను ఈ ప్రభుత్వం గౌరవిస్తోందన్నారు.
ముస్లింలలో పేదలందరికి వైఎస్సార్ రిజర్వేషన్‌లు అమలు చేశారని సీఎం గుర్తు చేశారు. నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నాం. మైనార్టీలకు మంత్రి వర్గంలో సముచిత స్థానం కల్పించామని సీఎం జగన్ చెప్పారు.
‘మైనార్టీల అభివృద్ధి కోసం కృషి చేశాం. శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ముస్లిం మహిళకు అవకాశం కల్పించాం. సాధికారిత అనేది మాటల్లో కాదు.. చేతల్లో చూపించాం. అన్ని రంగాల్లో మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మైనార్టీల అభ్యున్నతి కోసం 2019 నుంచి అనేక మార్పులు తీసుకొచ్చాం. మైనార్టీలకు మంత్రి పదవి ఇచ్చేందుకు గత సర్కారు ఏనాడు చొరవ చూపలేదు. లంచాలు, వివక్షకు తావులేకుండా పాలన కొనసాగిస్తున్నాం. భిన్నత్వంలో ఏకత్వం అనేదే మన బలం. ప్రతి పేదవాడి సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పని చేస్తోంది’’ అని సీఎం పేర్కొన్నారు.