తెలంగాణ వీణ , సినిమా : టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు చంద్రమోహన్ (78) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. తరచూ డయాలసిస్ చేయించుకుంటున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం (నవంబర్ 11న) తుది శ్వాస విడిచారు. సోమవారం హైదరాబాద్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మరణంపై సెలబ్రిటీలు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
కుటుంబ నేపథ్యం..
చంద్రశేఖర్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. కృష్ణాజిల్లా పమిడిముక్కలలో 1945 మే 23న జన్మించారు. మేడూరు, బాపట్లలో చదువుకున్నారు. ఈయన కె.విశ్వనాథ్‌కి దగ్గరి బంధువు. చంద్ర మోహన్ భార్య పేరు జలంధర్. ఈమె రచయిత్రి. వీరికి మధుర మీనాక్షి, మాధవి అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మధుర మీనాక్షి సైకాలజిస్ట్‌గా అమెరికాలో స్థిరడ్డారు. రెండో కుమార్తె మాధవి చెన్నైలో వైద్యవృత్తిలో సేవలందిస్తున్నారు.
సినిమా నేపథ్యం..
చంద్రమోహన్ 1966లొ రంగుల రాట్నం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తొలి సినిమాకే ఉత్తమ నటుడిగా నంది అవార్డు తెచ్చుకున్నారు. 1987లో చందమామ రావే, అతనొక్కడే సినిమాలో సహాయ నటుడిగా నంది అవార్డులు అందుకున్నారు. 2005లో పదహారేళ్ల వయసు సినిమాలో నటించినందుకుగానూ ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నారు. రంగుల రాట్నం, పదహారేళ్ల వయసు, సీతామాలక్ష్మి, రాధాకల్యాణం, రెండు రెళ్ల ఆరు, చందమామ రావే, రామ్ రాబర్ట్ రహీమ్ చిత్రాలతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు. 55 ఏళ్ల సినీ కెరీర్లో 932 సినిమాలలో నటించారు.
ఆ సినిమాలు తన కెరీర్లోనే స్పెషల్
సినిమాల్లోకి రాకపోయి ఉంటే డబ్బులు లెక్కపెట్టే ఉద్యోగం చేసుకుని ఉండేవాడినన్న చంద్రమోహన్ ఫస్ట్ సినిమా సక్సెస్ అయిన తర్వాత కూడా ప్రభుత్వోద్యోగానికి వెళ్లాలా? వద్దా? అని ఒకటికి రెండుసార్లు ఆలోచించారు. అంతిమంగా సినిమావైపే అడుగులు వేశారు. తన కెరీర్లో సిరిసిరిమువ్వ, శుభోదయం, సీతామహాలక్ష్మి, పదహారేళ్ల వయసు చిత్రాలను ఎన్నటికీ మర్చిపోలేనని చెప్తూ ఉండేవారు.
లక్కీ హీరోగా క్రెడిట్
ఒకప్పుడు హీరోయిన్లకు ఈయన లక్కీ హీరో. చంద్రమోహన్‌తో నటిస్తే సినిమా హిట్ అవ్వాల్సిందే. అలా కెరీర్ ప్రారంభంలో శ్రీదేవి, జయసుధ, జయప్రద.. ఈయనతో కలిసి నటించి హిట్స్ అందుకున్నారు. చంద్రమోహన్- సుధ కాంబినేషన్ అయితే సూపర్‌హిట్ అయింది. ఈయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా చిత్రాలు చేశారు. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ నటించారు. ఈయన నటించిన చివరి చిత్రం ఆక్సిజన్.