తెలంగాణ వీణ , హైదరాబాద్ : ప్రధానిగా దేశానికి నూతన దిశా నిర్దేశం చేసి, కాంగ్రెస్ పార్టీకి చిరకీర్తిని కట్టబెట్టిన పీవీ నరసింహారావు పేరెత్తడానికే ఆ పార్టీ నేతలకు భయం! ఢిల్లీకి రాజైన మన తెలంగాణ ముద్దుబిడ్డ పేరు తలచుకోవడానికీ ఇష్టపడరు. ప్రపంచం కొనియాడిన ఈ రాజనీతిజ్ఞుడు, దార్శనికుడి పేరు ఉచ్చరిస్తే ‘అధిష్ఠానం’ కన్నెర్ర చేస్తుందనే అనుమానం. ఇందిర, రాజీవ్ పేర్లను చెప్పుకొని తిరిగే హస్తం నేతలు తెలంగాణ ఠీవి.. పీవీని ఎందుకు విస్మరిస్తున్నారు? సంగీతం, సాహిత్యం, రాజకీయాల్లో పీవీకి వారసురాలైన సురభి వాణీ దేవి ఆవేదన వింటే.. అర్థమవుతుంది.
తండ్రిగా పీవీ ఎలా ఉండేవారు?
మాకు తెలిసిన నాన్న ఎప్పుడూ ప్రజా జీవితంలోనే ఉన్నారు. ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి, ఎంపీ, ప్రధానమంత్రిగానే నాన్నను చూశాను. నాన్న ఎంత బిజీగా ఉన్నా కుటుంబ బాధ్యతలు పక్కన పెట్టలేదు. ఆయనకు ఎనిమిది మంది సంతానం. కుటుంబానికి ఎంత సమయం కేటాయించాలో అంత కేటాయించారు.
ముందున్నోడిదే గ్రూప్.. నోరున్నోడిదే రాజ్యంలా ఉండే కాంగ్రెస్‌లో పీవీ ఎలా నెగ్గుకొచ్చారు?
అప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో నాన్న ముఖ్యమంత్రి అయ్యారు. 1969లో తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమాన్ని చల్లార్చేందుకు తెలంగాణ ప్రాంతం వాడైన నాన్న వాళ్లకు అక్కరకొచ్చారు. ముఖ్యమంత్రిని చేశారు. ఆయన మీద అభిమానంతో ఆ పదవి ఇవ్వలేదు. ముఖ్యమంత్రిగా నాన్న మంచి పనులు చేస్తుంటే వాళ్లే అడ్డుపడ్డారు.
గ్రూపు రాజకీయాల కాంగ్రెస్‌లో పీవీ బలం ఏమిటి?
ప్రతిపక్షం కంటే స్వపక్షమే ఎక్కువగా విమర్శించడం కాంగ్రెస్ చరిత్ర. తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భూ సంస్కరణల చట్టాలు చేశారు. దున్నేవాడికే భూమి ఉండాలని నాన్న కోరిక. ఆ చట్టంపై అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లోని భూస్వాములు వ్యతిరేకించారు. అయినా పట్టుపట్టి చట్టాన్ని ఆమోదం పొందేలా చేశారు. చర్చ సందర్భంలో వ్యతిరేకించేవాళ్లు బయటికి పోవచ్చు. బలపరిచేవాళ్లు అసెంబ్లీలో ఉండొచ్చని ధైర్యంగా ప్రకటించారు. ఆనాటి భూస్వాములంతా కలిసి నాన్నకు వ్యతిరేకంగా పావులు కదిపారు. అలాంటి రాజకీయాలకు ఆయన ఏనాడూ భయపడలేదు. కాంగ్రెస్‌లో గ్రూపిజం తెలిసిందే కదా! అవతలి వారికి ధనబలం, కండబలం ఏదైనా ఉండొచ్చు. నాన్నకు ఉన్న ఆయుధం ఒక్కటే. మేధోసంపత్తి. దానితోనే రాజకీయాల్లో రాణించారు. నాన్న విలువలకు ప్రాధాన్యం ఇచ్చారు. అవే నాన్నను కాపాడాయి.
ముఖ్యమంత్రి పదవి మధ్యలోనే పోయినందుకు పీవీ బాధపడ్డారా?
నాన్నకు వ్యతిరేకంగా గ్రూపు కట్టిన మంత్రులు రాజీనామా చేశారు. అయినా ఆయన భయపడలేదు. చివరికి సీఎం పదవి పోయేలా చేశారు. అప్పుడూ బాధపడలేదు. ‘పేదలు బాగుపడే చట్టం తెచ్చాను. నా జీవితంలో ఓ గొప్ప పని చేశాన’ని సంతోషించారు. నాన్నకు ఎవరో విమర్శిస్తారనే భయం ఉండేది కాదు. ఎవరి మెప్పు కోసమో పని చేయాలనే తాపత్రయం కనిపించదు. సాధారణంగా అధికారంలో ఉన్నవాళ్లను పడగొట్టే ప్రయత్నం విపక్షం చేస్తుంది. కానీ, కాంగ్రెసే వెనుక నుంచి పడగొట్టే ప్రయత్నాలు చేసింది. అదే కాంగ్రెస్‌లో ఉన్న సంస్కృతి!
పీవీని కాంగ్రెస్ గౌరవించలేదన్నది నిజమేనా?
ఈ దేశానికి ప్రధానమంత్రి పదవి చేపట్టడానికి కొద్ది రోజుల ముందు నాన్నకు అమెరికాలో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. అప్పుడు నాన్న వయసు 71 సంవత్సరాలు. రాజీవ్ గాంధీ హత్యానంతరం నాన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యారు. ప్రధానమంత్రిగా ఆయన్ను కాంగ్రెస్ ప్రతిపాదించింది. ‘దేశానికి సేవ చేయడానికి భగవంతుడు నాకు మళ్లీ పునర్జన్మ ప్రసాదించాడ’ని నాన్న సంతోషించారు. ప్రధానమంత్రిగా పదవి చేపట్టే నాటికి నిధులు లేక బంగారు నిల్వలు తాకట్టు పెట్టే పరిస్థితి. వ్యవస్థలో అనిశ్చితి ఉంది. 45 రోజులకు సరిపోయే ఫారెక్స్ నిల్వలు మాత్రమే ఉన్నాయి. అలాంటి గడ్డు పరిస్థితుల్లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వయోభారం, ఆరోగ్య సమస్యలను లెక్క చేయకుండా దేశం కోసం పనిచేశారు. ‘సేవియర్ ఆఫ్ ఇండియా’ అని ప్రశంసలందుకొన్నారు. కానీ, ఆ పదవి ముగిసిన తర్వాత పీవీని కాంగ్రెస్ పక్కన పెట్టింది. ఆయన కాలం చేసిన తర్వాత కూడా ఆ పార్టీ వైఖరి మారలేదు.