తెలంగాణ వీణ , మెదక్ : మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ నకిలీ డాక్టర్ అని బీజేవైఎం జాతీయ కోశాధికారి పీఎం సాయిప్రసాద్ ఆరోపించారు. శుక్రవారం ఆయన మెదక్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రోహిత్ ఫేక్ డాక్టర్ సర్టిఫికెట్లను వారం రోజుల్లో బయట పెడతామని తెలిపారు. ఆయన ఏ రోజూ కళాశాలకు వెళ్లలేదని, ప్రతిసారి వేరే వాళ్లతో పరీక్షలు రాయించాడని ఆరోపించారు. మైనంపల్లి రోహిత్ ఈ ఏడాది జనవరి వరకు మెదక్‌లో కనిపించలేదని అన్నారు.
ఝాటా మాటల్లో మైనంపల్లి హన్మంతరావు ఏక్ నంబర్.. ఆయన కొడుకు మైనంపల్లి రోహిత్ దస్ నంబర్ అని విమర్శించారు. హన్మంతరావు మల్కాజిగిరిలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని అన్నారు. కొర్విపల్లిలో మైనంపల్లి కిషన్‌రావు మెమోరియల్ మల్టీస్పెషల్ దవాఖాన నిర్మిస్తానని శిలాఫలకం వేసి ప్రజలను మోసం చేశాడని, దవాఖాన మాత్రం ఏర్పాటు చేయలేదని విమర్శించారు. మల్కాజిగిరి ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఎంతో మందిపై కేసులు పెట్టించి ప్రజలను ఇబ్బందులకు గురిచేశాడని ఆరోపించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ఏనాడు ప్రశ్నించలేదని విమర్శించారు. మైనంపల్లి మల్కాజిగిరిలో సొంత డబ్బులతో ఏమి ఖర్చు చేశాడో చెప్పాలని, దమ్ముంటే మెదక్ చౌరస్తాకు మళ్లీ వస్తా వేదికను డిసైడ్ చేయాలని సవాల్ విసిరారు. ఎంఎస్‌ఎస్‌వో ఆర్గనైజేషన్ ద్వారా సేవా పేరుతో ఖర్చు చేస్తున్న డబ్బులు మైనంపల్లి సొంత డబ్బులా? లేక ఆ ట్రస్ట్‌కు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు.