తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ కొడదామని ధీమాలో ఉన్నారు. ఆయన దానికి తగినట్లుగా రోజుకు మూడు వంతున ఎన్నికల సభలలో పాల్గొంటున్నారు. అయితే కేసీయార్ కి మద్దతు ఇచ్చేవారు ఒక వైపు ఉంటే వద్దు అనే వారు మరో వైపు ఉన్నారు. ఇది అత్యంత సహజం. ప్రజాస్వామ్యంలో మరో అవకాశం ఉన్నపుడు అందరూ ఒకే వ్యక్తి వైపు చూడరు. పైగా రెండు సార్లు అవకాశం కేసీయార్ కి జనాలు ఇచ్చారు. యాంటీ ఇంకెంబెన్సీ కూడా బాగా పెరిగిపోయింది. దాంతో పాటుగా కాంగ్రెస్ గ్రాఫ్ అంతకంతకు పెరిగిపోతోంది. ఇక కేసీయార్ గజ్వేల్ తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారు. కామారెడ్డిలో కేసీయార్ కి పోటీగా రేవంత్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. రేవంత్ రెడ్డికి ఏకంగా కేసీఆర్ పూర్వీకుల గ్రామస్తుల మద్దతు దక్కడం ఆశ్చర్యంగా మారింది. తన నామినేషన్ వేసేందుకు కామారెడ్డి వచ్చిన పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి డబ్బులను కోనాపూర్ గ్రామస్తులు అందజేసిన వైనం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేసీఆర్‌ను గద్దె దించేందుకే రేవంత్‌రెడ్డి నామినేషన్‌కి డబ్బులు అందజేశామని కోనాపూర్ గ్రామస్తులు చెప్పడం చూస్తే ఏదో జరుగుతోంది అన్న డౌట్లు అయితే వచ్చేస్తున్నాయి. కొన్ని సెంటిమెంటుకు దారి తీసే మద్దతులు ఉంటాయి. ఇది కూడా అలాంటిదే అని అంటున్నారు. మరో వైపు చూస్తే కామారెడ్డిలో నామినేషన్ వేసిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెంట కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పాల్గొనడం విశేషం. తెలంగాణ ప్రజల భవిష్యత్‌ను కామారెడ్డి నిర్ణయించబోతోందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సభలో ప్రకటించారు. దేశం మొత్తం కామారెడ్డి తీర్పు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. కేసీఆర్ పాలనకు కామారెడ్డి చరమగీతాన్ని పాడబోతోందని రేవంత్ రెడ్డి జోస్యమే చెప్పేశారు. ఇక కర్నాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ తెలంగాణా ఎన్నికల్లో పోటీకి దిగుతున్న బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని తనదైన సర్వేని వినిపించారు. నరేంద్ర మోడీ వందసార్లు తెలంగాణాకు వచ్చినా బీజేపీ గెలిచే అవకాశాలు లేనే లేవు అని సిద్ధరామయ్య ప్రకటినేశారు. ఇక రేవంత్ రెడ్డి రెండు నియోజకవర్గాల్లో కేసీఆర్‌ను ఓడిస్తారని కూడా జోస్యం చెప్పారు. కేసీయార్ తన వద్ద ఉన్న అవినీతి డబ్బుతో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు.