తెలంగాణ వీణ, ఏపీ బ్యూరో : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన ఉద్యమం వెయ్యి రోజులకు చేరుకుంది. ఈ ఉద్యమానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు , బండారు, మాజీ ఎమ్మెల్యే పళ్ళ. ఎమ్మెల్సీలు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, కాంగ్రెస్, జనసేన పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పోరాటాలు ద్వారా సాధించుకున్న పరిశ్రమ విశాఖ స్టీల్ ఫ్లాంట్ అని.. 32 మంది ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ఫ్లాంట్ కోసం ఎన్నికలు పక్కన పెట్టి పోరాడాలన్నారు. విశాఖ స్టీల్ ఫ్లాంట్ కోసం తాను రాజీనామా చేశానని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్టీల్ ఫ్లాంట్ విషయంలో విఫలం అయ్యారని విమర్శించారు. వైసీపీ ఎంపీలు స్టీల్ ఫ్లాంట్ కోసం ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. వైసీపీ ఎంపీలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలకు ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదన్నారు. ముఖ్యమంత్రి ఒకసారి కూడా ఉక్కు కార్మికుల దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం తెలియజేయలేదని గంటా శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు.విశాఖ స్టీల్ ఫ్లాంట్ కోసం ఎందరో పోరాటం చేశారన్నారు. తాను స్టీల్ ఫ్లాంట్ పరిరక్షణ కోసం న్యాయం పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. స్టీల్ ఫ్లాంట్ భూములు రియల్ ఎస్టేట్ కోసం అమ్ముకుంటున్నారన్నారు. ‘‘నా మీద కేసు పెట్టే దమ్ము ఉందా. విశాఖ ఎంపీగా నన్ను గెలిపించండి. నాకు జేడీ లక్ష్మీనారాయణ పూర్తి మద్దతు ఇవ్వనున్నారు. పార్లమెంటులో ఒక ఊపు, ఊపుతాను’’ అంటూ కేఏపాల్ పేర్కొన్నారు.