తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరిపై వైఎస్సార్ సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో బహునేర్పరి పురందేశ్వరి. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంటూ ఇంకోవైపు టీడీపీకి అనధికార గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగడం అనైతికం’’ అంటూ చురకలు అంటించారు.
‘‘తండ్రిని కాంగ్రెస్ పార్టీ అవమాన పరిచిందని, ఆ అవమానాల పునాదులపైనే ఏర్పాటైన టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీతో అంటకాగి చంద్రబాబు గెంటేసేసరికి అదే తండ్రిని అవమానించిన కాంగ్రెస్ లో చేరి నిస్సిగ్గుగా కేంద్ర మంత్రి పదవులు అనుభవించిన నీతిలేని చరిత్ర పురంధరేశ్వరిది’’ అంటూ విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు.
ఆంధ్రప్రదేశ్‌ను అవమానవీయంగా విభజన చేసిన కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా తనవంతు శకుని పాత్ర పోషించి రాష్ట్రాన్ని నాశనం చేసిన మహా గొప్ప మహిళ ఈ పురంధరేశ్వరి’’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.