తెలంగాణ వీణ , హైదరాబాద్ : పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటువేస్తే బీజేపీకి వేసినట్టేనని.. కాంగ్రెస్,బీజేపీ ఈ రెండు పార్టీలు ఒక్కటే అని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. సంగారెడ్డి పట్టణంలో గురువారం రాత్రి నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్ కన్నుసన్నుల్లో పనిచేస్తున్నట్లు ఆరోపించారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డిని ఓడించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో మైనార్టీలకు అన్నిరంగాల్లో సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని పేర్కొన్నారు. మజ్లిస్ పోటీచేయని చోట బీఆర్‌ఎస్‌కు ఓటే వేయాలని పిలుపునించారు.ఎంఐఎం అమ్ముడు పోతుందని రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది నేతలు బీజేపీలో చేరారని, వాళ్లు ఎంతకు అమ్ముడుపోయారని అసదుద్దీన్ ప్రశ్నించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని డబ్బులు తీసుకుని ఓడిపోయిందో చెప్పాలని ప్రశ్నించారు. జాతీయపార్టీలు అధికారంలో ఉన్నచోట శాంతిభద్రతల సమస్యలు వస్తున్నాయని, మైనార్టీల భద్రతను కాలరాస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణలో ప్రభుత్వం అన్నివర్గాలను సమానంగా చూస్తున్నదన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయని, బీఆర్‌ఎస్ పాలన బాగుందని అసదుద్దీన్ ప్రశంసించారు.