తెలంగాణ వీణ , జాతీయం : రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్టు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సంకేతాలు పంపింది. శ్రీకృష్ణుడి ఆశీస్సులు లభిస్తే తాను రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆమె స్పష్టం చేసింది. కంగనా శుక్రవారం ద్వారకాలో కృష్ణుడి ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించింది.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా అని విలేకరులు ప్రశ్నించగా కృష్ణుడి కృప ఉంటే ఎన్నికల బరిలో దిగుతానని పేర్కొంది. ఆమె నటించిన తేజాస్ చిత్రం ఇటీవల విడుదల కాగా అందులో భారత వైమానిక దళ పైలట్‌గా కంగనా నటించింది. సనాతన ధర్మం జెండా విశ్వవ్యాప్తంగా ఎగరాలని తాను ఆకాంక్షిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చింది.
సముద్రంలో మునిగిన ద్వారకా నగర అవశేషాలను వీక్షించేందుకు యాత్రికులను అనుమతించేలా ప్రభుత్వం తగిన ఏర్పాట్టు చేయాలని ఆమె విజ్ఞప్తి చేసింది. ద్వారకాధీశుడిని చూసేందుకు తాను వీలుచిక్కినప్పుడల్లా ఇక్కడకు వస్తుంటానని కంగనా తెలిపింది. ద్వారక అద్భుతమైన దైవిక నగరమని, ఇక్కడ ప్రతిఒక్కటీ అబ్బురపరిచేలా ఉంటుందని ఆమె పేర్కొంది.