తెలంగాణ వీణ , క్రీడలు : టీమిండియా క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్ పటేల్ తిరుమల విచ్చేశారు. వారు ఈ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వారిద్దరికీ వీఐపీ బ్రేక్ సమయంలో దర్శన అవకాశం కల్పించారు. రిషబ్ పంత్, అక్షర్ పటేల్ ను సంప్రదాయబద్ధంగా ఆహ్వానించిన టీటీడీ అధికారులు, ఆ మేరకు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం క్రికెటర్లకు రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించారు. టీటీడీ వర్గాలు పంత్, అక్షర్ పటేల్ లకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశాయి.
కాగా, పంత్, అక్షర్ పటేల్ రాకతో శ్రీవారి ఆలయం ఎదుట కోలాహలం నెలకొంది. వారితో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం ప్రదర్శించారు. రిషబ్ పంత్ గతేడాది ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. అక్షర్ పటేల్ ఇటీవల ఆసియా కప్ సందర్భంగా గాయపడ్డాడు.