తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వంపై పెన్షనర్లు తిరుగుబావుటా ఏగురవేశారు. మూడున్నర దశాబ్దాలుగా ప్రభుత్వ సేవ చేసిన తమ పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నదని, సకాలంలో పెన్షన్లు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నదని మండిపడ్డారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి రాజకీయ వేదిక ఉండాలనే ఉద్దేశంతో ‘ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ’ని స్థాపించినట్టు పార్టీ రాష్ట్రఅధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ పేర్కొన్నారు. గాంధీనగర్‌లోని హోటల్‌లో గురువారం ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. డిసెంబరు 2న విజయవాడలో తమ పార్టీ అవిర్భావ సభ నిర్వహించి విధివిధానాలు ప్రకటిస్తామన్నారు. వైసీపీ వంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని విమర్శించారు. ఈ ప్రభుత్వంపై పెన్షనర్లకు నమ్మకం సన్నగిల్లిందన్నారు. రాబోయే ఎన్నికల్లో సత్తా చూపిస్తామన్నారు. అన్ని అర్బన్ నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే నిర్మించాలని, అమరావతిని మాత్రమే రాజధానిగా కొనసాగించాలనేది తమ పార్టీ నిర్ణయమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులకు మద్దతు ధర లేకపోవడంతో పంటలకు క్రాప్ హాలిడే ప్రకటించి సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి లేక యువత ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులతో మద్యాన్ని అమ్మిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రికి చెప్పుకుందామంటే ఆయన అందుబాటులో ఉండరని మధ్యవర్తికి చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యస్ధితి రాష్ట్రంలో ఉందన్నారు. వలంటీర్ వ్యవస్ధను తెచ్చి పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. ఉపాధ్యక్షులు రామస్వామి, మునియ్య, కోశాధికారి టి.నాగభూషణం, కార్యదర్శులు పీఎ్‌సఎన్.మూర్తి, పరుచూరి రాజేంద్రప్రసాద్, జాయింట్ సెక్రటరీ కె.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.