తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు సీఎం కేసీఆర్ సమక్షంలో కండువా కప్పుకోనున్నారు. తెలంగాణ ఎన్నికల్లో తెలుగు దేశం పోటీ చేయవద్దని చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాసాని ఆ పార్టీ అధ్యక్ష పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ ఉండగా.. ఉన్న పార్టీని కాదని మరొక పార్టీని ఎన్నికల్లో గెలిపించాలనే లక్ష్యంతో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడికి లేఖ కూడా రాశారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్, సీఎం కేసీఆర్ నాయకత్వంలో అయితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే ఉద్దేశంతో బీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. ముదిరాజ్ సామాజిక వర్గంలో పట్టున్న నేతగా కాసాని జ్ఞానేశ్వర్‌కు గుర్తింపు ఉన్నది.