తెలంగాణ వీణ , ఖమ్మం : రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్తుపల్లి, ఇల్లెందు నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కల్లూరులో, 2 గంటలకు ఇల్లెందు మండలం బొజ్జాయిగూడెంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
ఈ నెల 27న ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో తొలి ఎన్నికల ప్రచార సభ విజయవంతం కావడంతో శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. ఇదే జోష్‌తో సత్తుపల్లి సభకు భారీ జనసమీకరణపై అక్కడి ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య దృష్టి సారించారు. సుమారు లక్ష మంది ప్రజలు హాజరయ్యేలా విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ఏర్పాట్లను మంగళవారం రాజ్యసభ సభ్యుడు, సత్తుపల్లి నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఎన్నికల ఇన్‌చార్జి బండి పార్థసారథిరెడ్డి, సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు పరిశీలించారు. సీఎం సభకు పోలీసు యంత్రాగం కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్‌లో హెలీకాప్టర్‌లో బయలుదేరే సీఎం కేసీఆర్.. నేరుగా కల్లూరుకు చేరుకుంటారు. అనంరతం అక్కడి సభలో నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
మధ్యాహ్నం 2 గంటలకు ఇల్లెందుకు..
కల్లూరులో సభ పూర్తికాగానే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మధ్యాహ్నం 2 గంటలకు ఇల్లెందు మండలం బొజ్జాయిగూడెంలో ఏర్పాటు చేసిన సభాస్థలికి సీఎం చేరుకుంటారు. అక్కడి సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇల్లెందు బీఆర్‌ఎస్ అభ్యర్థి హరిప్రియ విజయాన్ని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్ ఇల్లెందులో తొలి ప్రచార సభలో పాల్గొననున్నారు. సభ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ పరిశీలించారు. ఎంపీ రవిచంద్ర సభా ఏర్పాట్లను, సెక్టార్లను పరిశీలించారు. కాగా, బుధవారం నాటి సీఎం పర్యటనతో ఉమ్మడి జిల్లాలో వారం రోజుల వ్యవధిలోనే బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మూడు నియోజకవర్గాల్లో పర్యటించినట్లవుతుంది. అలాగే, ఈ నెల 5న కొత్తగూడెం, ఖమ్మం నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి పాల్గొననున్నారు.
కల్లూరులో సభాప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ సత్తుపల్లి నియోజకవర్గానికి దళితబంధు పూర్తిస్థాయిలో ఇవ్వడం, లబ్ధిదారులకు ఎంపిక సైతం పూర్తికావడం హర్షణీయమని అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ను గెలిపించి తీరుతామని ముఖ్యమంత్రికి మాట ఇచ్చేందుకే ప్రజలు పెద్ద ఎత్తున సభకు తరలిరానున్నారని అన్నారు. ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. ఇప్పటివరకు అభ్యర్థినే ప్రకటించని కాంగ్రెస్ పార్టీ అయోమయంలో ఉందని విమర్శించారు.