తెలంగాణ వీణ ,భక్తి : అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చెయ్యాలని చూస్తున్నారు అధికారులు. ఇప్పటికే మందిర నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయి. డిసెంబర్ పూర్తి అయ్యే నాటికి మందిర నిర్మాణం పూర్తి చేసేలా పనులను శరవేగంతో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులకు ఓ శుభవార్త వెలువడింది. అయోధ్య రామమందిరం లోని రాముని దర్శనం 2024 జనవరి నుండి మొదలవుతుంది. భక్తుల కోసం వచ్చే ఏడాది జనవరి 16వ తేదీ నుండి 24వ తేదీ మధ్యన రాములవారి విగ్రహ ప్రతిష్ట చేయనున్నారు. ఆలయ అధ్యక్షుల సమాచారం ప్రకారం 2024 జనవరి 22 వ తేదీన విగ్రహ ప్రతిష్ట చేయనున్నారు. కాగా విగ్రహ ప్రతిష్ట వేడుకలు 2024 జనవరి 16వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. జనవరి 22, మృగశిర నక్షత్రం రాములవారి విగ్రహ ప్రతిష్ఠాపనకు అనుకూలమైన సమయంగా పరిగణించబడింది.ఆ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు విగ్రహ ప్రతిష్ట చేయనున్నారు. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ అతిధిగా విచ్చేయనున్నారు. ఈ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ప్రసార మాధ్యమాల ద్వారా టెలికాస్ట్ చేయనున్నారు. కాగా విగ్రహ ప్రతిష్ట పూర్తయిన రెండు రోజుల తర్వాత నుండి భక్తులకు దర్శనం అనుమతించనున్నారు. ప్రస్తుతం రామాలయం మొదటి దశ పనులు దాదాపు పూర్తి అయ్యాయి. దీనితో ఆలయం దాని రూపాన్ని సంతరించుకుంది. ప్రస్తుతం చాలా వరకు పనులు చివరి దశలో ఉన్నాయి. 2024 జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవం దాదాపు ఖాయమని ఆలయ అధ్యక్షులు తెలిపారు. కాగా మందిర నిర్మాణం పనులు రెండు దశలుగా ఉన్నాయి. మొదటి దశలో దాదాపు 2.6 ఎకరాల విస్తీర్ణంలో ఆలయ గ్రౌండ్ ఫ్లోర్‌ను సిద్ధం చేయనున్నారు. కాగా ఆలయ గర్భగుడి నుండి ఇది మొదలవుతుంది. ఇందులో 5 మండపాలు ఉంటాయి. ఇక్కడ 160 పిల్లర్లు ఏర్పాటు చేసారు. వాటిపై వివిధ రాకాల శిల్పాలు దర్శనమిస్తాయి.