తెలంగాణ వీణ , సినిమా : టాలీవుడ్ స్టార్స్ వరుణ్ తేజ్ కొణిదెల, లావణ్య త్రిపాఠి మరికొన్ని గంటల్లో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. రేపు ఇటలీలోని టస్కనీలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. ఇందు కోసం అల్లు, మెగా కుటుంబాలు ఇప్పటికే ఇటలీ చేరుకున్నాయి. పెళ్లి సంబరాలను కూడా మొదలు పెట్టేశారు. పెళ్లి వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి కాక్‌టేల్ పార్టీ ని నిర్వహించారు. ఈ పార్టీలో చిరంజీవి – సురేఖ దంపతులతోపాటు రామ్‌చరణ్-ఉపాసన, అల్లు అర్జున్-స్నేహా రెడ్డి తదితరులు పాల్గొని సందడి చేశారు. ఇక ఈ పార్టీలో పెళ్లి కూతురు లావణ్య వైట్ డ్రెస్‌లో మెరిసిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇక నేడు హల్దీ, మెహందీ వేడుకలు నిర్వహించనున్నారు. ఇక 1వ తేదీన కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటికానున్నారు. వీరి వివాహానికి ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు, అత్యంత సన్నిహితులు హాజరుకానున్నారు. అనంతరం నవంబర్ 5వ తేదీన మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో వీరి వివాహ రిసెప్షన్ జరగనుంది. ఇక వీరి వెడ్డింగ్ కార్డ్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆరేళ్ల క్రితం వచ్చిన మిస్టర్ సినిమాలో తొలిసారి వరుణ్, లావణ్యలు కలిసి నటించారు. ఈ సినిమాతోనే వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ మరుసటి ఏడాది అంతరిక్షం సినిమాలో మరోసారి వీరిద్దరూ కలిసి నటించారు. ఇక అప్పటి నుంచి వీళ్ల స్నేహం కాస్త ప్రేమగా మారిందని తెలుస్తుంది. కాగా ఎంతో కాలంగా వీరిద్దరూ వాళ్ల ప్రేమను గోప్యంగానే ఉంచుతూ వచ్చారు. వీళ్ల రిలేషన్ పై ఎన్ని వార్తలు వచ్చిన వీరిద్దరూ ఎప్పుడూ వాటిపై స్పందించలేదు. చివరికి కుటుంబ సభ్యుల అంగీకారంతో ఇలా డెస్టినేషన్ వెడ్డింగ్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.