తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబు అరెస్ట్ వెనుక కేంద్ర ప్రభుత్వం ఉందని… ముఖ్యమంత్రి జగన్ ను అడ్డు పెట్టుకుని నాటకాలు ఆడుతోందని అన్నారు. ఈ విషయాన్ని రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెపుతారని వ్యాఖ్యానించారు. ఎన్నో రోజులు నిరీక్షించిన తర్వాతే నారా లోకేశ్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ ఇచ్చారని… అమిత్ షా ఇన్ని రోజులు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. కేంద్రం కనుసన్నల్లోనే అంతా నడుస్తోందని అన్నారు.
ఇదే సమయంలో జగన్ పై కేవీపీ విమర్శలు గుప్పించారు. మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పిన జగన్… అదే మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారని విమర్శించారు. మద్యం అమ్మకాలపై సరైన లెక్కలు లేవని… మద్యం అమ్మకాలలో నగదు మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. మద్యం అమ్మకాలపై ఎన్నో ఆరోపణలు వస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.