తెలంగాణ వీణ , మెదక్ : మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన రాజు అనే వ్యక్తి మొబైల్ కాల్ డేటాను పోలీసులు పరిశీలించనున్నారు.
కొత్త ప్రభాకర్ రెడ్డి పై దాడి ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డీజీపీని గవర్నర్ ఆదేశించారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా ఖండించాయి.
కేవలం అధికారం దక్కించుకోవాలనే యావతో విద్వేష పూరిత వ్యాఖ్యలు, రెచ్చగొట్టేలా ఉన్మాద ప్రసంగాలు చేస్తూ కార్యకర్తల మనసులను కలుషితం చేయడం ప్రారంభించారని పలువురు అంటున్నారు. బండి సంజయ్ అనేకసార్లు ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడారని, ఏకంగా ‘మసీదులు తవ్వు దాం.. శివం బయటికి వస్తే మాకు, శవం బయటికి వస్తే మీకు’ అంటూ విపరీత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు బీజేపీ కార్యకర్తలపై.. ముఖ్యంగా యువతపై ప్రతికూల ప్రభావం చూపించాయని అంటున్నారు. గంగా- జమున తెహ్‌జీబ్ సంస్కృతి పరిఢవిల్లే తెలంగాణ గడ్డమీద సామాజికంగా చీలికలు మొదలయ్యాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక రేవంత్‌రెడ్డి తన అధికార దాహంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, ఆయన కుటుంబంపై, ప్రభుత్వంపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. ఏకంగా ప్రగతిభవన్ మీద బాంబులు వేస్తామని ఫిబ్రవరిలో బహిరంగంగా వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈటల రాజేందర్ సైతం సభ్యసమాజం తలదించుకునేలా దూషిస్తున్నారని, ‘ఎవడు రా కొడకా’ అంటూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని, పదేపదే తన కులం పేరు వాడుతూ సామాజికంగా విభజన సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఉదహరిస్తున్నారు. బీజేపీకి చెందిన మరో నేత ధర్మపురి అర్వింద్.. ‘కేసీఆర్ చనిపోతే బీజేపీ రూ. 5 లక్షలు ఇస్తుంది. కేటీఆర్ చనిపోతే రూ.10 లక్షలకు పెంచుతం. అదే కవిత చనిపోతే నేనే రూ.20 లక్షలు ఇస్తా’ అంటూ బాహాటంగా ప్రకటించారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో నాయకులపై దాడుల సంస్కృతి వెలుగుచూస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
దుబ్బాక నియోజకవర్గం సూరంపల్లిలో సోమవారం జరిగిన దాడికి ఒక వ్యక్తిని బాధ్యుడిని చేస్తేనే సరిపోదని, రెచ్చగొట్టే ప్రసంగాలతో ప్రజల్లో విభేదాలు సృష్టిస్తున్న నాయకులందరి పాపం ఇందులో ఉన్నదని పలువురు మండిపడుతున్నారు. అధికారంలోకి రావడానికే ఇన్ని అరాచకాలకు పాల్పడితే.. ఒకవేళ వాళ్లు అధికారంలోకి వస్తే జరిగే పరిణామాలు ఊహించడం కూడా కష్టంగా ఉన్నదని బీఆర్‌ఎస్ నేతలు చెప్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.