తెలంగాణ వీణ , నల్గొండ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వంలో పార్టీలు దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ సభలు, సమావేశాలతో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. షెడ్యూల్‌లో భాగంగా మంగళవారం నల్లగొండ జిల్లాలో 3 కీలకమైన బహిరంగ సభలను నిర్వహించబోతోంది. హుజూర్‌నగర్, మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. మరోసారి బీఆర్ఎస్‌నే గెలిపించాలని ఓటర్లను ఆయన అభ్యర్థించబోతున్నారు. ఈ సభలకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. అయితే మంగళవారం తెల్లవారుజాము నుంచి నల్గొండలో వర్షం పడుతుండడం కలవరానికి గురిచేస్తోంది. అయితే వర్షం కారణంగా ఈ సమావేశాలకు ఏమైనా ఇబ్బంది కలగనుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
మరోవైపు కీలక మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ కూడా ముమ్మరంగా ప్రచారాన్ని సాగిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఎమ్మెల్యేలు, అభ్యర్థులు సీఎం కేసీఆర్ బహిరంగ సభలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు.