తెలంగాణ వీణ, సినిమా : శ్రీకాంత్ శ్రీరామ్, కుశీ రవి, ఈశ్వరీ రావు, శ్రీనివాస్ అవసరాల, రవివర్మ ప్రధాన పాత్రల్లో సాయి కిరణ్ దైదా దర్శకత్వం వహిస్తున్న చిత్రం పిండం. కాలాహి మీడియా బ్యానర్ పై యస్వంత్ దగ్గుమటి నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకోవడమే కాకుండా భయం పుట్టిస్తోంది.ఇక ఈ టీజర్ లో ఈశ్వరి రావు.. ఆత్మలను వదిలించే మోడ్రన్ మంత్రగత్తెలా కనిపించింది. ఇక శ్రీనివాస్ అవసరాలకు తన లైఫ్ లో చూసిన ఒక భయంకరమైన ఆత్మ గురించి చెప్పడంతో టీజర్ మొదలవుతుంది. శ్రీరామ్ ది ఒక అందమైన కుటుంబం. భార్య, ఇద్దరు పిల్లలు, తల్లితో కలిసి ఉంటాడు. అయితే ఆ ఇంట్లోనే వారికి వ్యతిరేకంగా కొన్ని ఆత్మలు పనిచేస్తూ ఉంటాయి. ముఖ్యంగా శ్రీరామ్ చిన్న కూతురు ఒంట్లోకి ఒక ఆత్మ ప్రవేశించి వారిని భయపెడుతూ ఉంటుంది. ఇక ఆ ఇంటిని వెతుకుంటూ ఈశ్వరి రావు వస్తుంది. అసలు ఆ చిన్నారిని పట్టి పీడిస్తున్న ఆత్మ ఎవరిది.. ? అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది ..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. దెయ్యాల భయంకర రూపాలను చూపించి భయపెట్టలేదు కానీ, కృష్ణ సౌరభ్ సూరంపల్లి తన మ్యూజిక్ తో ప్యాంట్ తడిపేసాడు. ముఖ్యంగా దెయ్యం కనిపిస్తుంది అని అనుకొనేలోపే.. మ్యూజిక్ తో గుండెలు ధడేల్ అనేలా చేయడం ఆకట్టుకుంటుంది. ఇక టీజర్ లో యదార్ధ సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించినట్లు తెలిపి మరింత ఆసక్తిని కలిగించారు. ఇక ఈ టీజర్ చూసిన అభిమానులు ఒరేయ్.. టీజర్ చూస్తేనే ప్యాంట్ తడిసిపోతుంది.. థియేటర్ లో గుండె ఆగితే ఎవర్రా రెస్పాన్సిబిలిటీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.