తెలంగాణ వీణ , జాతీయం : మహారాష్ట్రలో మరాఠా కోటా నిరసనలు హింసకు దారి తీశాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకే నివాసాన్ని మరాఠా రిజర్వేషన్ ఆందోళనకారులు సోమవారం ముట్టడించారు. బీడ్ జిల్లాలోని ఆయన ఇంటిపై రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. బిల్డింగ్ వద్ద ఉన్న పలు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. మరాఠా రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు మనోజ్ జరంగే పాటిల్ గత ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకే ఈ దీక్షపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మరాఠా కోటా నిరసనకారులు ఆగ్రహంతో రగిలిపోయారు. ఆయన ఇంటిపై రాళ్లు రువ్వడంతోపాటు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.