తెలంగాణ వీణ , జాతీయం : అవినీతి, మనీలాండరింగ్ ఆరోపణలతో జైలుపాలైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టులోనూ ఊరట దక్కలేదు. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. నగదు బదిలీకి సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తగిన ఆధారాలు సమర్పించిందని పేర్కొంది. రూ.338 కోట్ల నగదు బదిలీ వ్యవహారం ముడిపడిన కేసు కావడంతో సిసోడియాకు బెయిల్ ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. కాగా, సిసోడియా గడిచిన ఎనిమిది నెలలుగా జైలులో ఉన్నాడు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో అవకతవకలకు పాల్పడ్డారని, పాలసీని వ్యాపారులకు అనుకూలంగా తయారుచేశారని మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లిక్కర్ పాలసీపై సర్వత్రా విమర్శలు రావడం, విషయం కోర్టుకు చేరడంతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సర్కారు దీనిని పక్కన పెట్టింది. అయితే, ఈ వ్యవహారంలో పెద్దమొత్తంలో మనీలాండరింగ్ జరిగిందనే ఆరోపణలతో ఈడీ రంగంలోకి దిగింది. విచారణ ప్రారంభించి ఒక్కొక్కరినీ అరెస్టు చేస్తూ వస్తోంది.