తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : సిర్పూర్ మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన బూరం చెన్నమల్లు యాదవ్ స్వల్ప జ్వరంతో ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లాడు. ఆర్‌ఎంపీ ఇచ్చిన ఇంజక్షన్‌తో కేవలం ఐదు గంటల్లో ప్రాణాలు కోల్పోయాడు. చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడు సైతం ఇలాగే మృతి చెందాడు. తాజాగా చింతలమానెపల్లి మండలం కోర్సిని గ్రామానికి చెందిన వివాహిత దన్నూరి పుష్పలత ప్రాణాలు కోలో్పయింది. ఆమె చిన్నారులు తల్లి ప్రేమకు దూరమయ్యారు. కౌటాల మండలం తుమ్మిడిహెట్టికి చెందిన గోంగ్లె బండు– చైతన్య దంపతుల కుమార్తె ఆద్యశ్రీ (4) ఓ ఆర్‌ఎంపీ నిర్లక్ష్యంతో ప్రాణాలు విడిచింది. వరుసగా చోటుచేసుకుంటున్న ఈ ఘటనలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గల్లీగల్లీకి వెలుస్తున్న ఆర్‌ఎంపీ క్లినిక్‌లు, అనుమతి లేని రక్త పరీక్షా కేంద్రాలు.. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్నాయి. విచ్చలవిడి వైద్యంతో ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. పరిధి దాటి వైద్యం చేస్తు న్న కొందరు ఆర్‌ఎంపీలు పేదల ప్రాణాలు తీస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1200 మందికి పైగానే ఆర్‌ఎంపీలు ఉన్నట్లుగా ఆర్‌ఎంపీ, పీఎంపీల సంఘాల లెక్కలు చెబుతున్నాయి. కనీస పరిజ్ఞానం లేని కొందరు ఆర్‌ఎంపీలు, పీఎంపీలు వైద్యపరీక్షలు చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడం, సొంతంగా మందులు రాయడం, ఇంజక్షన్‌లు వేయడం చేస్తున్నారు. కొద్దినెలల పాటు ఆర్‌ఎంపీలకు అసిస్టెంట్లుగా పనిచేసిన వారు సైతం గ్రామాల్లో సొంతంగా క్లినిక్‌లు తెరుస్తున్నారు.
ఆర్‌ఎంపీలు పరిధి దాటి వైద్యం చేస్తున్నా వైద్యారోగ్యశాఖ అధికారులు మాత్రం చర్యలు తీసుకోవ డం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ‘ ఓ వైపు ప్రాణా లు పోతున్నా పట్టించుకోరా..?’ అంటూ ప్రజలు నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నార
ఇటీవల బాధితులు మృతి చెందిన ఘటనలు ఆర్‌ఎంపీలు అందించిన వైద్యంతోనే జరిగినట్లు తెలుస్తోంది. జ్వరంతో బాధపడుతున్న వారికి ఇంజక్షన్ ఇచ్చిన అనంతరం తీవ్ర అస్వస్థతకు గురై గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారు. వాంతులు చేసుకోవడం, చలి పెరగడం, శరీరమంతా దద్దుర్లు రావడం వంటి లక్షణాలు అధికంగా కనిపిస్తున్నాయి. పరిస్థితి అదుపులోకి రాకపోగా రోగులు నేరుగా కోమాలోకి వెళ్తున్నారు. ఆర్‌ఎంపీలు చేస్తున్న వైద్యం, వారు ఇస్తున్న ‘కిల్లింగ్ ఇంజక్షన్’ ఏంటన్నది వైద్యాధికారులు తేల్చాల్సి ఉంది.
వైద్యం అనేది రోగిని అన్నిరకాలుగా పరీక్షించి అందించాల్సి ఉంటుంది. సరైన పద్ధతిలో వైద్యం అందించకపోతే వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హతలు ఉన్నవారి వద్దే వైద్యం తీసుకోవాలి. బాధితుల పరిస్థితిని తెలుసుకునే అవకాశం కేవలం నిపుణులకు మాత్రమే ఉంటుంది.