తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. ఇప్పటికే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌ఎస్.. ప్రచారంలోనూ ముందున్నది. వరుసగా మూడోసారి అధికారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తున్నారు. తొమ్మిదిన్నరేండ్ల నుంచి జరుగుతున్న అభివృద్ధి, ఇప్పటికే అమలులో ఉన్న పథకాలు నిర్విరామంగా కొనసాగాలంటే మరోసారి బీఆర్‌ఎస్ అధికారంలోకి రావాలంటూ ప్రజలకు వివరిస్తున్నారు. అధికారం కోసం విపక్షాలు చేస్తున్న విషపు ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు.
ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని జుక్కల్, బాన్సువాడ, మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్‌లో పర్యటించనున్నారు. తొలుత కామారెడ్డి జిల్లాలోని జుక్కల్‌లో జరుగనున్న బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్‌ను జుక్కల్‌కు చేరుకుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న బాన్సువాడకు చేరుకుంటారు. పట్టణంలోని వీక్లీ మార్కెట్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. సభ ముగిసిన తర్వాత నారాయణఖేడ్‌కు పయణమవుతారు. ప్రజా ఆశీర్వాద సభలకు సంబంధించిన ఏర్పాట్లను బీఆర్‌ఎస్ నాయకులు ఇప్పటికే పూర్తిచేశారు. మూడు పట్టణాల్లోని ప్రధాన కూడళ్లు, సభ ప్రాంగణాలు గులాబీ మయమయ్యాయి. ఎక్కడ చూసినా భారీ కటౌట్లు, బీఆర్‌ఎస్ జెండాలతో గులాబీ వర్ణం అద్దుకున్నాయి.