తెలంగాణ వీణ , వికారాబాద్ : కొంత కాలంగా వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ దంపతులు మంజుల రమేష్ ఆదివారం బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. వారి రాజీనామాతో పట్టణంలో పార్టీకి గట్టి దెబ్బే అని చెప్పవచ్చు. మున్సిపల్ పరిధిలోని అన్ని వర్గాల్లో రమేష్ కుమార్‌కు మంచి పట్టు ఉంది. మాస్ నాయకుడిగా గుర్తింపు పొందారు. అనేక సార్లు స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. నాలుగు సార్లు ఇండిపెండింట్‌గా పోటీ చేసి కౌన్సిలర్‌గా విజయం సాధించారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత 2015లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తరఫున మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసిన రమేష్‌కుమార్ అందరి ఊహలను తలకిందులు చేస్తూ ఏడుగురు కౌన్సిలర్లను గెలిపించుకున్నారు. దీంతో ఆయనకు పట్టణంలో మరింత పట్టు పెరిగింది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ ఏ చంద్రశేఖర్‌కు మద్దతు ఇచ్చారు. చంద్రశేఖర్ సాధించిన 20వేల ఓట్లలో సుమారు మూడు వేల ఓట్లు పట్టణంలో పోలయ్యాయి. ఇందులో రమేష్ కుమార్ ప్రధాన భూమిక పోషించారనే ప్రచారం ఉంది.
అధికార పార్టీ కౌన్సిలర్లు ఎవరూ కౌన్సిల్ సమావేశానికి హాజరు కాకుండా చేశారని మీడియా ముందు వాపోయారు. అంతటితో ఆగకుండా సొంత పార్టీ చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టించిన ఘనత ఎమ్మెల్యేకు దక్కుతుందని కూడా ఆరోపించారు. కౌన్సిల్ సమావేశంలో తోటి మహిళా కౌన్సిలర్ చేతిలో నుంచి మైక్ తీసుకున్నందుకు తనపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారని, పార్టీ పెద్దలు జోక్యం చేసుకోవడంతో కేసు వాపసు తీసుకున్నారని చైర్పర్సన్ అప్పట్లో ఆరోపించారు. అనేక అభివృద్ధి పనులకు ఆమోదం తెలపకుండా ఎమ్మెల్యే అడ్డుకున్నారని బహిరంగంగానే విమర్శించారు. ఎంత అవమానించినా భరిస్తూ పార్టీలో కొనసాగినట్లు తెలిపారు. తమకు సముచిత స్థానం లేని చోట ఉండటం ఇష్టం లేకనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
మంజుల రమేష్‌కుమార్ దంపతుల బాటలోనే బీఆర్ఎస్ పార్టీకి చెందిన 6వ వార్డు కౌన్సిలర్ చందర్ నాయక్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జే అరుణ్ కుమార్, విశ్రాంత ఇంజనీర్, జే ప్రదీప్ కుమార్, బీఆర్ఎస్ పట్టణ యువ నాయకుడు సాయికృష్ణ పార్టీకి రాజీనామా చేశారు. ఏది ఏమైనా ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంజుల రమేష్‌కుమార్ దంపతులు బీఆర్ఎస్ను వీడడం గట్టి దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.